Ambati Rambabu: వాలంటీర్లపై టీడీపీ మీడియా విషం చిమ్ముతోంది
Ambati Rambabu fires on yellow Media Campaign
ఏపీలో సచివాలయ వాలంటీర్లపై టీడీపీ మీడియా విషం చిమ్ముతోందని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వాలంటీర్లు హత్యలు, అత్యాచారాలు, మోసాలు, రాష్ట్రంలో అనేక ఘోరాలు చేస్తున్నారని రాస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనను ప్రజల గుమ్మం వరకు వెళ్ళి అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారని తప్పుబట్టారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పనికి రేటు పెట్టి మరీ దోచుకున్నాయని గుర్తుచేశారు.
చంద్రబాబు హయాంలో పెన్షన్ ఎంత మందికి ఇచ్చే వారు? ఎంత ఇచ్చేవారు? ఇప్పుడు ఎంత ఇస్తున్నారో తెలుసా అని ప్రశ్నించారు. ఒకటి రెండు చోట్ల తప్పులు చేసే వాళ్ళు ఉండొచ్చని, అంతమాత్రాన అందరికీ తప్పుబట్టడం సమంజసం కాదని మంత్రి అన్నారు. అలాంటి విషయాలను స్పందనలో రిపోర్ట్ చేసిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాలంటీర్లు క్రిమినల్స్ కాదు, దోపిడి దారులు కాదని తెలిపారు.
చంద్రబాబు కోసం తప్పుడు కథనాలు రాస్తున్న వారే దోపిడీదారులని దుయ్యబట్టారు. ఇదే తనకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు మనసులో మాట బయటపెట్టారని అంబటి గుర్తుచేశారు.
ప్రజల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదని, ముఖ్యమంత్రి పదవి కోసం రాలేదు అంటున్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతాను అని శపధం చేశావ్‌గా, మరి ఏ మాట వాస్తవం అని అంబటి ప్రశ్నించారు.