AP Political Heat : ఏపీ పొలిటికల్ ట్రావెల్స్. సీఎంతో సహా అందరూ అక్కడే..బస్తీ మే సవాల్
AP Political Leaders into the Masses: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపుగా ఇంకా ఏడాదిన్నారకు పైగా సమయం ఉంది. ఇదే సమయంలో అధికారంలో ఉన్న సీఎం జగన్ పైన ప్రతిపక్ష పార్టీల అధినేతలకు ఎన్నో అనుమానాలు. సడన్ గా ముందస్తుకు వెళ్తారనే సందేహాలు. ఎలాగైనా జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలనేది ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు..అండ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఈ ఇద్దరు నేతలు తిరిగి పొత్తుతో ఎన్నికల్లో కలుస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాని విషయం. కానీ, ఇద్దరి అడుగులు.. లక్ష్యం మాత్రం ఒక్కటే. ఇప్పుడు సీఎం జగన్ టార్గెట్ చేస్తోందీ ఈ ఇద్దరినే. ఇక, మహానాడు ఇచ్చిన జోష్ తో టీడీపీ.. ప్లీనరీకి వచ్చిన స్పందనతో వైసీపీ అప్పుడే ఎన్నికల్లో గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖ్య నేతలు సిద్దమై పోయారు.
ఇప్పటికే చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటనలు.. అభ్యర్ధుల ప్రకటన ప్రారంభించారు. ప్రతీ సభలోనూ సీఎం జగన్ పాలనలోని లోపాలను..తప్పులను ప్రస్తావిస్తూ వైసీపీ పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, చంద్రబాబు తనయుడు లోకేష్ అక్టోబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. 2014 ఎన్నికలకు ముందు తన తండ్రి నిర్వహించిన మీ కోసం తరహాలో ఈ సారి మీకోసం 2.0 వర్షన్ అన్నట్లుగా లోకేష్ ఈ యాత్రకు సిద్దం అవుతున్నారు. ఇందుకోసం రూట్ మ్యాప్. .ఏ జిల్లాలో ఎన్ని రోజులు కొనసాగాల్సిన అవసరం ఉంది, పర్యటించాల్సిన నియోజకవర్గాల పైన సర్వే సంస్థల నివేదికల ఆధారంగా షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. తండ్రి చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా మినీ మహానాడు – నియోజకవర్గ స్థాయి సమీక్షలు చేస్తున్నారు.
లోకేష్ పూర్తిగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతీ రెండు రోజులకు ఒక సభ.. రోడ్ షో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రజల ముందుకు వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. అక్టోబర్ 5న విజయ దశమి కావటంతో అదే రోజున పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి దాదాపు ఆరు నెలల పాటు పవన్ టూర్ కొనసాగనుంది. పవన్ సైతం జగన్ ప్రభుత్వాన్నే టార్గెట్ చేయనున్నారు. అదే సమయంలో పొత్తుల విషయంలో వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచుతున్న పవన్..బీజేపీ – టీడీపీతో పాటుగా తనను దత్తపుత్రుడుగా మాత్రమే పరిగణిస్తున్న వైసీపీకి సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన రూట్ మ్యాప్ కు ఇంకా తుది రూపు ఇవ్వాల్సి ఉంది. ప్రతిపక్షాల నేతల పర్యటనలు ఇలా ఫిక్స్ అవ్వటంతో.. సీఎం జగన్ సైతం వారంలో ఒక జిల్లాలో పర్యటించేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రచ్చబండ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావించారు. కానీ, కరోనా అడ్డుపడింది. ఇక, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే..అక్కడ కోరికలు – సమస్యలు పరిష్కారానికి ఆర్దిక సమస్యలు వెంటాడుతున్నాయి. రానున్న మూడు నెలల కాలంలో వీటిని సర్దుబాటు చేసుకొని..ప్రజల్లోకి వెళ్లాలనేది సీఎం ఆలోచనగా సమాచారం. తాను మూడేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమంతో పాటుగా.. పార్టీ పరిస్థితులను స్వయంగా సమీక్షించేలా సీఎం షెడ్యూల్ ఉంటుందని చెబుతున్నారు. 2017 లో జగన్ తన పాదయాత్ర ప్రారంభించిన రోజు అయిన..నవంబర్ 6న 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేలా ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. వారంలో రెండు రోజులు ఒక జిల్లాలో పార్టీ – ప్రభుత్వ వ్యవహారాల సమీక్ష ఉండేలా షెడ్యూల్ ఖరారు కానుంది. దీంతో.. ఇక, ఎన్నికల ప్రచారం అనధికారంగా మొదలు కానుంది. రాజకీయంగా ప్రధాన నేతలంతా ప్రజల మధ్యకే వస్తుండటంతో..ఏపీలో మందుగానే ఎన్నికల హంగామా ప్రారంభం కానుంది. విజయ దశమి నుంచి ఏపీలో రాజకీయం వేడెక్కనుంది.