Investors Meet in AP: ఏపీలో ఇన్వెస్టర్ల సదస్సు, వ్యాపార దిగ్గజాలకు ఆహ్వానం
AP invites several industrialists for Investors Summit in March
ఏపీ ప్రభుత్వం మరి కొన్ని రోజుల్లో పెట్టుబడుల సదస్సు నిర్వహించనుంది. భారీ స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ సదస్సుకు హాజరై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన దిగ్గజ సంస్థలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. మార్చి3, 4 తేదీల్లో విశాఖలో జరిగే ఈ సదస్సుకు ప్రధాని మోడీ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్, యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్, అమేజాన్ సంస్థ సీఈఓ జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాలను ఏపీలో జరిగే సదస్సుకు హాజరుకావాలని అధికారులు ఆహ్వానించారు. వీరితో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓ సత్య నాదెళ్లను కూడా ఆహ్వానించారు.
విశాఖలో రెండు రోజుల పాటు జరిగే ఈ పెట్టుబడుల సదస్సుకు 15 మంది కేంద్ర మంత్రులు, 15 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తలు, 53 మంది భారతదేశ పరిశ్రమ దిగ్గజాలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
భారతదేశ దిగ్గజాల విషయానికి వచ్చే సరికి ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా, ఆదీ గోద్రెజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్.చంద్రశేఖరన్ వంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే 2019లో విజయవాడలో ఓ ప్రద్యేక సదస్సు నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన కంపెనీలను ఆహ్వానించి డిప్లోమాటిక్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది మార్చి నెలలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యే వారు దాదాపుగా 5-8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విశాఖలో జరగనున్న సదస్సు నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. గత ఏడాది ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. 2022లో 1,26,750 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం క్లియర్ చేసిందని ట్వీట్ చేశారు. అందుల్ 81,000 కోట్ల ప్రాజెక్టులు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులేనని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. ఈ ఏడాది జరగనున్న సదస్సు మరింత విజయవంతంగా జరగనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.