High Court: AP ప్రభుత్వానికి షాక్.. జీవో నెం.1ని సస్పెండ్ చేసిన కోర్టు!
AP high Court Suspends GO No 1: జీఓ నెంబర్ ఒకటిని ఈనెల 23 వరకు హైకోర్టు సస్పెండ్ చేసింది. జీఓ నెంబర్ ఒకటి నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో నెం.1 పై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే, అంతేకాక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై కొందరు హైకోర్టుకు వెళ్లగా ఈమేరకు కామెంట్లు చేసింది. నిజానికి గతంలో జీవో నెం.1పై ఏపీ లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్ వివరణ కూడా ఇచ్చారు. సభలు, సమావేశాల నిర్వహణ మీద ఎలాంటి నిషేధం లేదని తెలిపారు. అయితే, నియమనిబంధనలకు లోబడి సభలు, సమావేశాలు జరుపుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రజల భద్రత చాలా ముఖ్యమైన అంశమని ఇటీవల జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని ఈ జీవో తీసుకువచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. 1861 చట్టానికి లోబడే జీవో నెం.1 తీసుకువచ్చారని ఈ జీవో అమలులో ఉండడం వలన షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. రోడ్ల మీద సభలు పెడితే రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది అని పోలీసులు అనుమతి నిరాకరించ వచ్చని తెలిపారు. ఆయా సభలకు పోలీసులు ప్రత్యామ్నాయ వేదికలు సూచిస్తారని, లేకపోతే సభల నిర్వాహకులే ప్రత్యామ్నాయాలు సూచించవచ్చని అరుదైన పరిస్థితుల్లో సభలకు అనుమతి ఇవ్వక పోవడం కూడా జరుగుతుందని చెప్పుకొచ్చారు.