AP Govt: ఉద్యోగులపై నిఘాకు స్పెషల్ స్క్వాడ్లు.. మిస్సయితే మాములుగా ఉండదు!
AP Govt Special Squads For Employees: అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ గురించి సహనటుడు ప్రస్తావిస్తూ అతని చర్యలు ఊహాతీతం అనే డైలాగ్ వాడతాడు, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చర్యలు కూడా ఒక రకంగా ఊహాతీతం అని అనుకుంటున్నారు ఏపీ ప్రజలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఎవరూ ఊహించని మార్పులను కూడా జగన్ తెరమీదకి తీసుకొచ్చారు. మరీముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు మద్యం షాపుల వద్ద డ్యూటీలు చేయాలని, అలాగే అప్పటివరకు ఎలక్షన్ డ్యూటీలో మునిగితేలే ప్రభుత్వ ఉపాధ్యాయులు వాటికి పూర్తిగా దూరం కానున్నారని ఇలాంటి చర్యలను ఎవరూ ఊహించలేదు.
కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వాటిని చేసి చూపించవచ్చని నిరూపించింది. ఇప్పుడు అలాంటిదే సరికొత్త నిర్ణయం ఒకటి దానిని తెర మీదకు తెచ్చింది. అదేమంటే ఉద్యోగులు సరిగా ఆఫీసులకు వస్తున్నారా? ఒకవేళ వచ్చినా తర్వాత ఆఫీస్ వేళల్లో ఏదైనా ప్రైవేట్ పనులు పెట్టుకుని బయటకు వెళ్తున్నారా? అనే విషయాల మీద ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది. ప్రభుత్వం జీతం ఇస్తున్నది ప్రజలకు సేవ చేసేందుకే, ఆఫీసులో సరిగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునేందుకే అని చెబుతూ ఇప్పుడు ఏదైనా ప్రైవేటు పని కోసం బయటకు వెళుతున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త! అంటూ సంచలన హెచ్చరికలు పంపింది.
ఎప్పుడైనా ఫ్లయింగ్ స్క్వాడ్ మీ ఆఫీసుకు వచ్చి మీరు అక్కడ ఎందుకు లేరు అని ప్రశ్నిస్తూ మీకు మెమో ఇవ్వవచ్చు అంటూ హెచ్చరికలు పంపడం హాట్ టాపిక్ అయింది. సాధారణంగానే స్వేచ్ఛ కోరుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయం మీద మండిపడుతున్నా, సాధారణ ప్రజానీకం మాత్రం ఉద్యోగం చేసినందుకే కదా జీతం ఇచ్చేది! మరి ఉద్యోగం చేసే సమయంలో మీకు బయట ఏం పని? జగన్ మీకు బాగానే రూల్స్ పెడుతున్నారు అంటూ ఆయన పనిని సమర్థిస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ విషయం మీద ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయేమో వేచి చూడాల్సి ఉంది.