AP Politics: చంద్రబాబు చేతికి ఆయుధంగా..జీవో నెంబర్ ఒన్
AP Govt Issued GO No1 Became Political Boon for Chandra Babu: చంద్రబాబుపై ఎక్కు పెట్టిన జీవో నెంబర్ 1 అస్త్రం ఎవరికి కలిసి వచ్చింది. చంద్రబాబు పాల్గొన్న కందుకూరు..గుంటూరు సభల్లో తొక్కిసలాటలో మరణాలు చోటు చేసుకుంది. ఈ కారణంగా రాజకీయంగా అధికార వైసీపీ చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టింది. చంద్రబాబు సభల్లో సామాన్యుల ప్రాణాలు పోతున్నాయంటూ కార్నర్ చేసారు. ఇరుకు సందుల్లో సభలు ఏర్పాటు చేసి తన సభలకు భారీగా స్పందన వస్తుందని చూపించే ప్రయత్నం చేసారని టార్గెట్ చేసారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల వేళ జరిగిన తొక్కిసలాటను తెర మీదకు తీసుకొచ్చారు. రోడ్ల పైన సభలను నియంత్రించేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో తీసుకొచ్చింది.
జీవో నెంబర్ 1 పేరుతో సభల నిర్వహణ పైన ఆంక్షలు విధించింది. ఈ జీవో పైన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని తప్పుబట్టాయి. అసంబద్ద జీవోలను తీసుకొచ్చారని మండిపడ్డాయి. దీనికి స్పందనగా ఈ జీవో వైసీపీకి వర్తిస్తుందని ప్రభుత్వంలోని ముఖ్యులు స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు కుప్పం పర్యటన వేళ ఈ జీవో అమలు తో అక్కడ రోడ్ షోలకు అనుమతి నిరాకరించారు. చంద్రబాబును అడ్డుకున్నారు. అక్కడే చంద్రబాబు తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేసారు. ప్రభుత్వం తనను అడ్డుకుంటుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు. తనను అడ్డుకొనే ప్రయత్నం చేసిన పోలీసులను ఇరుకున పెట్టారు. తాను నెల ముందే అనుమతి తీసుకుంటే, ఇప్పుడు ఇచ్చిన జీవోతో ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. పోలీసులు అడ్డుకోవటంతో పాదయాత్రగా గ్రామాల్లోకి వెళ్లారు.
మూడు రోజుల కుప్పం పర్యటనలో ప్రధానంగా చంద్రబాబు ఈ జీవో గురించి పదే పదే ప్రస్తావించారు. ప్రభుత్వం తనను అడ్డుకొనే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అసలు ప్రభుత్వం జారీ చేసిన జీవో అసంబద్దంగా ఉందని వాదించారు. చంద్రబాబును కుప్పంలో అడ్డుకోవటం పైన జనసేనాని పవన్ స్పందించారు. చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. అన్ని పార్టీలు దాదాపుగా చంద్రబాబును అడ్డుకోవటం పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు కోరుకుందీ ఇదే. ఇతర పార్టీలతో పాటుగా ప్రజల్లోనూ ఈ వ్యవహారంలోనూ మద్దతు సాధించే ప్రయత్నంలో ముందుడుగు వేసారు. కుప్పంలో చంద్రబాబును ఎలాగాైన ఓడిస్తామని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కుప్పంలో ఆధిక్యత నిరూపించుకుంది. ఇప్పుడు కుప్పం ప్రజల వద్దకు పాదయాత్ర ద్వారా వెళ్లి వారి సానుభూతి పొందే ప్రయత్నం చేసారు.
చంద్రబాబుతో మాత్రమే కాదు, సంక్రాంతి రేసులో నిలిచిన వీర సింహారెడ్డి.. వాల్తేరు వీరయ్య సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు సంబంధించిన అనుమతుల విషయంలో కొంత డైలమా పరిస్థితులు కనిపించాయి. ఒంగోలు కేంద్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డికి అనేక తర్జన భర్జనల తరువాత ఒంగోలులో ముందుగా నిర్ణయించిన ప్రదేశం మార్చిన తరువాత అనుమతి ఇచ్చారు. ఇదే పరిస్థితి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలోనూ కొనసాగుతోంది. ముందుగా ఆర్కే బీచ్ లో ఈవెంట్ నిర్వహణకు అనుమతి కోరగా, తిరస్కరించారు. తాజాగా ఏయూ గ్రౌండ్స్ లో అనుమతి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఈ జోవో పైన ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ సాగింది. సభల నిర్వహణలో ఏం జరిగినా నిర్వాహకులనే బాధ్యలను చేయాలని, సభలకు అనుమతులు నిరాకరించటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం ఈ జీవో పైన పునరాలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం అంతమింగా ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.