AP Govt Appeal: జీవో నెంబర్ 1 పై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం అప్పీల్..
AP Govt Appeal on High Court Suspension order on GO No 1 : ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై సుప్రీం కోర్టులో అప్పీల్ కు వెళ్లింది. ఏపీలో రోడ్ల పైన బహిరంగ సభలు, రోడ్ షో లపై ఆంక్షలు విధిస్తూ జీవో తీసుకొచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటల్లో 8 మంది మరణించారు. దీంతో, వైసీపీతో సహా అన్ని పార్టీలకు తాము తీసుకొచ్చిన జీవో వర్తిస్తుందని ప్రభుత్వం లోని ముఖ్య నేతలు చెబుతూ వచ్చారు. ఈ జీవో ను ప్రస్తావిస్తూ కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో, సభలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.
కుప్పం లో చంద్రబాబును అడ్డుకోవటాన్ని జనసేనాని పవన్ ఖండించారు. చంద్రబాబు వద్దకు వెళ్లీ సంఘీభావం ప్రకటించారు. ప్రతిపక్షాలను అడ్డుకోవటానికే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారని, ఈ జీవోను రద్దు చేసే వరకూ తాము పోరాటం చేస్తామని చంద్రబాబు, పవన్ ప్రకటించారు. ఈ జీవో పైన ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. వెకేషన్ బెంచ్ ఈ పిటీషన్ విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ సమయంలో జీవోకు సంబంధించి ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. ఈ నెల 23వ తేదీ వరకు జీవోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 20వ తేదీ లోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
హైకోర్టు జీవోను సస్పెండ్ చేయటంతో, ఈ ఉత్తర్వుల పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటీషన్ దాఖలు చేసింది. రాజకీయంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఈ జీవో విషయంలో టార్గెట్ చేస్తున్నాయి. ఈ జీవో అమలు ప్రభుత్వానికి సవాల్ గా మారుతోంది. తాము అన్ని పరిశీలించే ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఈ జీవో తీసుకొచ్చామని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయటంతో, న్యాయ పరంగా ..సాంకేతికంగా ఈ జీవో పైన వస్తున్న అన్ని రకాల విమర్శలకు ఉన్నత న్యాయ స్థానం ఇచ్చే తీర్పు సమాధానం కానుంది.