AP Govt Employees: బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలపై ఉద్యోగుల సంఘం నేతలు ఫైర్
AP Govt Employees: నిన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీద ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్ ను కలిసి తమ జీతాల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరిన నేపథ్యంలో, నిన్నటి నుంచి ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా బండి శ్రీనివాసరావు నిన్న చేసిన కామెంట్ల మీద సూర్యనారాయణ స్పందించారు. ఉద్యోగుల సర్వీసు నియంత్రణ అధికారం గవర్నర్ కే ఉందని, అందుకే ఆయనను కలిశామని అప్పుడు కూడా తాము ఎక్కడా ఇతర సంఘాల పేరు, నేతల గురించి ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ఒకటో తేదీ జీతాలు ఇవ్వాలని జీవోలు ఉన్నాయే తప్ప చట్టం లేదని పేర్కొన్న సూర్యనారాయణ అలాంటి చట్టం ఉంటే చూపించాలని అన్నారు.
ఇక రేపట్నించి సమ్మె చేసేందుకు తాము సిద్ధంగా లేమని, కార్యాచరణ ప్రకారమే ముందుకు వెళతామని అన్నాము కానీ సమ్మె చేస్తామని తాము చెప్పలేదని వివరించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి దొడ్డిదారిన గుర్తింపు తీసుకువచ్చినట్లు వారు చేస్తున్న ఆరోపణలు సరికాదని జీతాలపై చట్టం చేయమంటే… సంఘం గుర్తింపు రద్దు చేయమంటారా? అని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంఘం మీద గతంలోనూ ఫిర్యాదు చేశారని, కోర్టుకు కూడా వెళ్లారని ఆయన అన్నారు. అయితే ఎన్జీవో నేతల ఫిర్యాదు సరికాదంటూ సీఎం జగన్ తమ సంఘానికి గుర్తింపునిచ్చారు అని చెప్పుకొచ్చారు. ఇక ఏపీ ఎన్జీవో సంఘంలో నాన్ గెజిటెడ్ స్థాయి వారే ఉన్నారని, తమ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో అటెండర్ నుంచి అధికారుల వరకు ఉన్నారని మరో నేత ఆస్కార్ రావు వెల్లడించారు.