AP Govt New Target: ఏపీ ప్రభుత్వం కొత్త టార్గెట్… ఆశించిన పెట్టుబడులు వస్తాయా?
AP Govt New Target: మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పెట్టుబడిదారుల సదస్సును విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు 2500 మంది ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో అంబానీ, అదాని, టాటా వంటి పారిశ్రామిక వేత్తలు కూడా హాజరుకానున్నారు. కాగా, ఈ సదస్సు ద్వారా ఏపీ సుమారు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కొత్త రాష్ట్రం, విశాఖ సిటీ ఆఫ్ డెస్టనీ పేరుతో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా, వివిధ రకాల స్కీమ్‌లను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 2028 వరకు వివిధ రకాల పారిశ్రామిక పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో లాజిస్టిక్ పాలసీ 2022-2027, రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్స్ పాలసీ 2020-2025, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020-2025, టూరిజం పాలసీ 2020-2025, ఏపీ రిటైల్ పార్క్ పాలసీ 2021-2026 ముఖ్యమైనవి. ఈ పాలసీల కింద పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఆర్థికంగా ఏపీ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక వేత్తలకు తెలియజేయనున్నారు.
తద్వారా, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమౌతున్నది. ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి పారిశ్రామిక వేత్తలకు వివరించాలని చూస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం అందుకు విరుద్దంగా ఏపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రచారం చేస్తున్నది. ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేస్తూ ఆర్థికంగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అప్పులు తెచ్చి ప్రభుత్వం ఉచితాల పేరుతో పంచిపెడుతోందని, అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ ఎలా ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ పెడుతుందో చూడాలి.
మార్చి 3,4 తేదీల్లో జరిగే వైజాగ్ పారిశ్రామిక వేత్తల సదస్సు ద్వారా ప్రభుత్వం అనుకున్న విధంగా పెట్టుబడులను ఆకర్షించగలిగితే ప్రతిపక్షాలు వాదనలకు చెక్ పడినట్టే అవుతుందా? ప్రభుత్వం ఏ మేరకు పెట్టుబడులను ఆకర్షిస్తుందో చూడాలి. ఈ సదస్సులో పారిశ్రామిక వేత్తలతో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరుకానున్నారు.
ఏపీలో టైర్ 2 నగరాలు అనేకం ఉన్నాయి. ఇందులో అతిపెద్ద నగరం విశాఖ పట్నం. విశాఖను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. విశాఖతో పాటు విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు నగరాలను కూడా అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగానే పెద్ద నగరమైన విశాఖకు పరిపాలను మార్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమౌతున్నది.
గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తే, వైపీసీ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసనరాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండటం వలన మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ ప్రభుత్వం ఆలోచన. మార్చి 3,4 తేదీల్లో జరిగే పారిశ్రామిక వేత్తల సదస్సు ద్వారా పరిపాలన రాజధానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.