AP Government: కందుకూరు ఘటనపై జ్యూడిషియల్ ఎంక్వైరీకి ఆదేశం
AP Government: ఏపీలో నెల్లూరు జిల్లా కందుకూరులో, గుంటూరు జిల్లా ఉయ్యూరులో జరిగిన ఘటనలపై రాష్ట్రప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ రెండు ఘటనలపై జ్యూడిషియల్ ఎంక్వైరీని ఆదేశించింది. దీనికోసం రిటైర్డ్ జడ్జి శేష శయన రెడ్డితో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 28 వ తేదీన, జనవరి 1వ తేదీన తొక్కిసలాటకు జరగడానికి గల కారణాలు, దారి తీసిస పరిస్థితులు, ఏర్పాట్లు, తదితర విషయాలపై కమిషన్ విచారణ చేపట్టనున్నది. ఈ విచారణ రిపోర్ట్‌ను నెల రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది. అంతేకాకుండా, పర్మిషన్ ఇస్తే దానికి అదనంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై కూడా కమిషన్ నివేదకను ఇవ్వనున్నది.
డిసెంబర్ 28 వ తేదీన తెలుగుదేశం పార్టీ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో నెల్లూరు జిల్లా కందుకూరులో సభను ఏర్పాటు చేసింది. ఈ సభ జరిగే సమయంలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల వ్యవధిలో గుంటూరు జిల్లా ఉయ్యూరులో జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకలను పంపకాలు జరిగిన సమయంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి చెందారు. ఈ రెండు ఘటనల తరువాత ఏపీ ప్రభుత్వం సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ జీవో నెంబర్ 1ని అమలులోకి తీసుకొచ్చింది.