AP Govt: తప్పుడు వార్తా కథనాలపై ఏపీ సర్కార్ సీరియస్
AP Government is serious on False News Stories
ప్రభుత్వం సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించటం లేదని మీడియాలో వచ్చిన కథనాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షన్ల చెల్లింపులపై వివరణ ఇచ్చింది. తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమం, కొత్త నియామకాలు, తదితర అంశాలపై వివరణ ఇస్తూ 8 పేజీల లేఖను ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రంలో 90 నుంచి 95 శాతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లను ఐదో తేదీలోగా ప్రభుత్వం చెల్లిస్తోందని ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు.కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుంటుపడినా జీతాల చెల్లింపుల్లో జాప్యం జరగడం లేదని తెలిపారు. దాదాపుగా 95 శాతం ఉద్యోగులకు జీతాలతో పాటు, పింఛన్లను సకాలంలో చెల్లిస్తున్నామనని మిగతా 5 శాతం మందికి చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని ఆర్ధిక్ కార్యదర్శి వివరించారు. ఉద్యోగుల జీతాలకు సంబందించిన బిల్లులను సకాలంలో ఖజానా అధికారులు పంపించగలిగితే అసలు సమస్యే ఉండదని తెలిపారు.
ఏపీలో కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు ఇటీవలే గవర్నర్ ను కలిసి తమ గోడు వినిపించారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇచ్చేలా చూడాలని గవర్నర్ ను కోరారు. సకాలంలో జీతాలు రాకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గవర్నర్ కు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. అసలు విషయాలను వెల్లడించింది.