Dulhan Scheme Stopped in AP : చేతులెత్తేసిన ప్రభుత్వం
ఏపీలో దుల్హన్ పథకం ద్వారా పేద ముస్లిం మైనారిటీ యువతులకు పెళ్లి సందర్భంగా రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు తాజాగా హైకోర్టుకు నివేదించింది. దుల్హన్ పథకం అమలు కాకపోవడాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైకాపా అధికారంలోకి వస్తే అన్నివిధాలుగా అండగా ఉంటామని, దుల్హన్ పథకం కింద యువతులకు లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని, అంతేకాకుండా ఇస్లామిక్ బ్యాంకులు ఏర్పాటుతో ఆర్థికంగా తోడు ఉంటామని జగన్ ప్రజాసంకల్పయాత్రలో భరోసా ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక అవి అమలు చేయడం లేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత షారూఖ్‌షిబ్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారించగా, మైనారిటీలు ఎదురుచూస్తున్న దుల్హన్ పథకం ద్వారా లబ్ధిదారులకు ఊరట కల్పించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ పథకం అమలుపై హైకోర్టుకు నివేదించారు. ఆ నివేదికలో ఆర్థిక ఇబ్బందులతో ఈ పథకాన్ని నిలిపి వేసినట్లుగా పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం అఫిడవిట్లపై రిప్లై దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.