Andhrapradesh: ఏపీలో కొత్తగా మరో 6 మండలాల ఏర్పాటు
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 6 మండలాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో అనంతపురం, ఒంగోలు, నంద్యాల, చిత్తూరు, విజయనగరంలను అర్బన్, రూరల్ మండలాలుగా… మచిలీపట్నంను సౌత్, నార్త్ మండలాలుగా విభజిస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది.
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని వార్డులు, శివారు గ్రామాలను కలుపుకొని సౌత్, నార్త్ మండలాలుగా విభజించింది. మచిలీపట్నంలోని 1 నుంచి 19 వరకు వార్డులను కలుపుకొని సౌత్ మండలంగా, శివార్లలోని గ్రామాలను విలీనం చేస్తూ నార్త్ మండలంగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మండలాల విభజనపై అభ్యంతరాలు ఉంటే నెలలోగా అభ్యంతరాలను తెలపాలని జిల్లా కలెక్టర్ కు సూచించింది. దాంతో ఏపీలో కొత్తగా మరో 6 మండలాలు ఏర్పాటు కాబోతున్నాయి. రెవెన్యూ పరంగా మరింత సుపరిపాలన అందించడంలో భాగంగా ఈ ప్రక్రియకు ఏపీప్రభుత్వం శ్రీకారం చుట్టింది.