AP Employees ready to action plan: ఉద్యమం దిశగా ఏపీ ఉద్యోగ సంఘాలు
AP Employees ready to action plan: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేసేందుకు సిద్ధమౌతున్నాయి. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోగా, ఉద్యోగులు దాచుకున్న సొమ్మును, డీఏ, అలవెన్సులను కూడా ఇవ్వడం లేదు. అంతేకాకుండా నెలవారి జీతాలు కూడా సమయానికి ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళనలు చెందుతున్నారు. అంతేకాకుండా, పీఆర్సీలోనూ అన్యాయం జరిగిందని ఉద్యోగులు వాపోతున్నారు. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రేపు ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. ఇక ఈనెల 9 వ తేదీన ఉద్యమ కార్యచరణను ప్రకటించనున్నారు.
ఉద్యమ కార్యచరణ నుండి వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే ఏపీ అమరావతి జేఏసీ స్పష్టం చేసింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని, తమతో ఏపీ జేఏసీ కూడా కలిసి రావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాలన్నీ కలిసికట్టుగా ఉద్యమిస్తే ప్రభుత్వం దిగి వస్తుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఎన్నికలు ఇంకా ఏడాది సమయం ఉండటంతో అన్ని సంఘాలు కలిసి పనిచేయాలని, అప్పుడే ప్రభుత్వం డిమాండ్లు నెరవేరుస్తుందని జేఏసీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించే అవకాశం ఉందని ఉద్యోగులు భయపడుతున్నారని, అలాంటి ఇబ్బందులు రాకుండా జేఏసీ నేతలు చూసుకుంటారని కూడా చెబుతున్నారు.