CM Jagan meets PM Modi: పెండింగ్ నిధులను విడుదల చేయండి, పీఎం మోడీకి సీఎం జగన్ వినతి
AP CM Jagan meets PM Narendra Modi
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి చెందిన అనేక సమస్యలను వివరించారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రధానిని కోరారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలోని మోడీని కలిసిన సీఎం జగన్ ఓ వినతి పత్రం సమర్పించారు.
రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు దాటిందని, ఇప్పటికీ పరిష్కరించాల్సిన అనేక అంశాలు పెండింగ్ లోనే ఉండిపోయాయని ప్రధానికి సీఎం జగన్ గుర్తుచేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న అనేక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ ప్రధాని మోడీని కోరారు.
ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విషయాలను అమలు పరిచే విధంగా చర్యలు చేపట్టేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని సార్లు సమావేశమై కొన్ని సమస్యలు పరిష్కరించిందని, ఇంకా అనేక సమస్యలు పరిష్కరించాల్సి ఉందని సీఎం జగన్ ప్రధానికి తెలియజేశారు.
ఏపీ రాష్ట్రానికి ఇస్తున్న రుణ పరిమితిని తగ్గించారని, కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారని..ప్రస్తుతం ఆ నిర్ణయం సమీక్షించి రాష్ట్రానికి ఇస్తున్న రుణ పరిమితిని పెంచాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. అదే విధంగా పోలవరం విషయం కూడా ప్రధానికి వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇంకా అందలేదని, పెండింగ్ నిధులు త్వరగా విడుదల చేయాలని కూడా సీఎం జగన్ ప్రధానిని కోరారు.