Amaravathi: సోము వీర్రాజుకు నిరసన సెగ, అమరావతి నిర్మాణంపై నిలదీసిన రైతు
ఏపీ బీజేపీ అభ్యక్షుడు సోము వీర్రాజు జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. మనం-మన అమరావతి పేరుతో చేస్తున్న యాత్రలో సీఎం జగన్పై పలు విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుంటే రాజధాని ఎందుకు కట్టడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేశారని, ఇందుకు వైసీపీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా కారణమేనని విమర్శించారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని అన్నారు. గత ముఖ్యమంత్రి వైసీపీ ఉచ్చులో పడకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
అమరావతిలో సోము వీర్రాజును నిలదీసిన రైతు
మనం-మన అమరావతి పేరుతో బీజేపీ నేతలు చేస్తున్న యాత్రలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. సోము వీర్రాజును ఓ రైతు నిలదీశాడు. జగన్ బీజేపీ ఇద్దరూ దొంగలేనని తేల్చిపారేశాడు. మీరిద్దరే అమరావతిని ముంచేశారని ఆరోపించాడు. అమరావతి అనేది నినాదమేనా.. నిజంగా అమరావతి కట్టేది ఉందా అంటూ ఆ రైతు సోము వీర్రాజును నిలదీశాడు.
ఈ క్రమంలో ఆ రైతును సముదాయించడానికి వీర్రాజు ప్రయత్నించారు. అమరావతి ఆలస్యం కావడానికి గల కారణాలను రైతుకు వివరించారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 8500 కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబు అమరావతి మధ్యలో వదిలిపెట్టారని, బీజేపీ నుంచి వెళ్లిపోవటంతోనే చంద్రబాబు ఓడారని వివరించారు. మాతోనే ఉంటే చంద్రబాబు గెలిచేవారని కూడా వీర్రాజు ఆ రైతుకు వివరించారు. రెండేళ్లలో అమరావతిని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.