AP Assembly : 16న ఏపీ బడ్జెట్ – 24 వరకు అసెంబ్లీ సమావేశాలు
AP Govt to Present Budget 2023-24 in Assembly on 16th March: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాల నిర్వహణ పైన బీఏసీలో చర్చించారు. స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ తో పాటుగా మంత్రులు..టీడీపీ సభాపక్ష నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ నెల 16న సభలొ 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం ఈ సమావేశంలో స్పష్టం చేసింది. అదే రోజున ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెడతామని వెల్లడించింది. రేపటి నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పైన చర్చ ప్రారంభం కానుంది. ప్రభుత్వం ఈ సమావేశాల్లో 15 బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రతిపాదించారు.
మొత్తం 9 పని దినాలు 24వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపైన చర్చకు సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికార వైసీపీ నుంచి 22 అంశాల పైన చర్చకు ప్రతిపాదనలు అందాయి. ఈ రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నజీర్ అహ్మద్ ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో పారదర్శక పాలన జరిగిందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా లబ్ది దారుల ఖాతాల్లో నగదు జమ చేస్తుందని వివరించారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం తొలి స్థానంలో నిలిచిందని చెప్పారు. సంక్షేమ పథకాల గురించి వివరించిన గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ప్రస్తావనకు రాలేదు. సభలో విశాఖ నుంచి పాలన పైన ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది.