AP JAC Vs AP Govt: వెనకడుగు వేయబోం… ఉద్యమం తప్పదు
AP JAC Vs AP Govt: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య యుద్ధం తప్పేలా కనిపించడం లేదు. ఉద్యోగుల జేఏసీ ఉద్యమ కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఏపీ మంత్రివర్గ ఉప సంఘం ఉద్యోగుల జేఏసీలతో విడివిడిగా చర్చలు నిర్వహించింది. అయితే, ఈ చర్చలు అనధికారికంగా జరిగాయి. ఈ చర్చల్లో వివిధ సంఘాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో మంత్రి బొత్సా సత్యన్నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఉద్యోగుల సమస్యల కంటే వచ్చే నెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపైనే మంత్రులు దృష్టి సారించడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికలకు మద్దతు ఇవ్వాలని మంత్రి బొత్సా సత్యన్నారాయణ ఏపీ జేఏసీ నేతలను కోరారు.
ఉద్యమ కార్యాచరణను విరమించుకోవాలని కోరగా, అందుకు జేఏసీ ససేమిరా అన్నది. ఏది అడిగితే అది ఇస్తున్నాం కదా అని మంత్రులు చెప్పగా, ఏమిస్తున్నారని జేఏసీ నేతలు ప్రశ్నించారు. 11వ పీఆర్సీలో కోతలు విధించినప్పటి నుండి వరసగా డిమాండ్లను మంత్రివర్గ ఉపసంఘం ముందు ఉంచారు. డిమాండ్లలో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని డిమాంట్లు పరిష్కారం కాకుంటే ఉద్యమం చేయక తప్పదని అన్నారు. అయితే, డిమాండ్లపై సీఎస్‌తో చర్చిద్దామని చెప్పగా,లేఖలు రాశామని, కానీ ఎలాంటి స్పందన రాలేదని ఏపీ జేఏసీ, అమరావాతి జేఏసీ అధ్యక్షులు తెలిపారు. ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని, ఉద్యమం చేసి తీరుతామని మంత్రివర్గ ఉపసంఘానికి జేఏసీ నేతలు తెలిపారు.