తిరుమలలో ఎట్టకేలకు నాలుగో చిరుతను అధికారులు బంధించారు. అలిపిరి కాలినడక మార్గంలో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనుకు చిరుత చిక్కింది. దీంతో ఇప్పటి వరకు నాలుగు చిరుతలను అధికారులు బంధించారు.
Tirumala: తిరుమలలో కొద్దిరోజులుగా చిరుతలు (Leopard) హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కాలినడకన వెళ్లే భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఓ చిన్నారిని కూడా హతమార్చాయి. అంతకంటే ముందు ఓ బాబును తీవ్రంగా గాయపరిచాయి. ఈక్రమంలో చీతాలను బంధించేందుకు అటవీశాఖ, టీటీడీ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడక్కడా బోన్లను కూడా అమర్చారు. ఇప్పటి వరకు మూడు చిరుతలను అధికారులు బంధించారు. ఆదివారం మరో చీతా బోనుకు చిక్కింది.
అలిపిరి కాలినడకమార్గంలోని 7వ మైలు వద్ద చిరుత సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. ఈ మేరకు దానిని బంధించేందుకు పది రోజుల క్రితం 7వ మైలు వద్ద బోనును ఏర్పాటు చేశారు. దానిని బంధించేందుకు పది రోజులుగా అటవీశాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చివరికి ఆదివారం రాత్రి 7 గంటలకు చిరుత బోనుకు చిక్కింది. ఆ చిరుత రోజూ బోను వద్దకు వచ్చి వెనుదిరిగి వెళ్లేదని అధికారులు వెల్లడించారు.
ఇక దీనితో కలిపి మొత్తం నాలుగు చీతాలను అధికారులు బంధించారు. జూన్ 23న 7వ మైల్ వద్దే అధికారులు ఓ చీతాను బంధించారు. ఆ తర్వాత ఆగష్టు 14, 17 తేదీల్లో మరో రెండు చీతాలను ట్రాప్ చేశారు. ఇక ప్రస్తుతం నడకమార్గంలో ఓ ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దానిని ట్రాప్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.