Anil Kumar Yadav: మంత్రి పదవి పోవడంతో నన్ను చాలా మంది వదిలేశారు
AP EX minister Anil Kumar Yadav Comments on his loyalists
ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నుంచి తనను తొలగించి ముఖ్యమంత్రి జగన్ మంచి చేశారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పదవి పోయిన రోజు సాయంత్రమే కొందరు నన్ను వీడారని, కొంత కాలం తర్వాత మరికొందరు వదిలి పెట్టారని గుర్తుచేసుకున్నారు. సొంత మనుషులు ఎవరనే విషయం తనకు తెలిసిందన్నారు.
గతంలో మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు నన్ను వీడినా, 2019 ఎన్నికల్లో 8 మంది కార్పొరేటర్లు తన వెంటవున్నా తాను గెలుపొందానన్నారు. ఇటీవల పలువురు అనిల్‌ను వీడుతున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
అనిల్ కుమార్ యాదవ్ ఏపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖా మంత్రిగా కొన్నేళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత సామాజిక సమీకరణాల కారణంగా కొందరు మంత్రులను సీఎం జగన్ తొలగించారు. వారిలో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. అప్పటి నుంచి అనిల్ తన ప్రాభవాన్ని కోల్పోయారు. మంత్రి పదవిలో ఉన్న సమయంలో తరచుగా మీడియాలో కనిపించిన అనిల్, పదవి పోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. కేవలం తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఎప్పటికప్పుడు హాట్ కామెంట్లు చేసే అనిల్ జోరు తగ్గించారు.