APJAC: ఈ నెల 9వ తేదీ నుంచి ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ సిద్ధం..ఏపీ జేఏసీ
APJAC: ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న చులకన వైఖరికి నిరసనగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై అనేక సార్లు ప్రభుత్వానికి విన్నపించిన పట్టించుకోలేదని అన్నారు. గతంలో తాము 11వ పీఆర్సీని కోల్పోయామని, ఇస్తున్న రాయితీలను కూడా పోగొట్టుకున్నామని, అయినప్పటికీ ప్రభుత్వానికి సహకరిస్తుంటే ఎంతో చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.
తమ సహనాన్ని చేతకానితనంగా భావిస్తున్నారన్నారు. తమ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని, సీఎం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణకు నేటి నుండి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలు బొప్పారాజు, బండి శ్రీనివాసులు ఈ నోటీస్‌ను ఇవ్వనున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు అమలు చేయనున్నాయి.. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వంపై జేఏసీ నేతలు ఒత్తిడి చేయనున్నారు.