AP MLC Results: కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి… ఫలితాలపై ఆసక్తి
AP MLC Results: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ఇప్పటికే పూర్తయ్యాయి. మార్చి 16వ తేదీ గురువారం రోజున కౌంటింగ్ జరగనున్నది. పేపర్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించడంతో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాలెట్ పత్రాల లెక్కింపుపై ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ పేపర్లపై అంకెలు తప్పించి అక్షరాలు ఉండకూడదని, బ్యాలెట్ పేపర్లపై అక్షరాలు ఉంటే వాటిని చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. మూడు గ్రాడ్యుయేట్, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఈనెల 13వ తేదీన ఎన్నికలు జరిగాయి.
అయితే, పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఇక అధికార ప్రతిపక్షాలు గెలుపు తమదేనంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులు పోటీ చేయకున్నా, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఓటు వేయాలని జనసేన సూచించింది. ఇక ఇదిలా ఉంటే, కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల స్థానం నుండి అత్యధికంగా 49 మంది బరిలో ఉండగా, విశాఖ పట్టభద్రుల స్థానం నుండి 37 మంది, ప్రకారం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేషన్ స్థానం నుండి 22 మంది బరిలో ఉన్నారు. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 20 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మార్చి 16వ తేదీ మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.