AP High Court: వాలంటీర్లకు సంక్షేమ పథకాల అర్హుల ఎంపికను ఎలా అప్పగిస్తారు..ఏపీ హైకోర్టు
AP High Court: ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేక వాలంటీర్లను పెట్టారా అని ప్రశ్నించిన హైకోర్టు – లబ్దిదారుల ఎంపిక బాధ్యతను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారు? – గతంలో లబ్ధిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా అని ఏపీప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. లబ్ధదారుల ఎంపిక బాధ్యతను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారు? అని నిలదీసింది. రాజకీయ కారణాలతో తమను జాబితా నుంచి తొలగించారని గారపాడుకు చెందిన 26 మంది లబ్ధిదారులు.. హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
దేశంలోనే మొదటిసారిగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రూపొందించింది. కానీ.. కొన్ని చోట్ల కొందరు చేసే పనులు ఈ మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులమీద నమ్మకం లేకపోతే వారినే శాశ్వత ఉద్యోగులుగా నియమించి సర్వీస్ రూల్స్ రూపొందించండి అని కోర్టు వెల్లడించింది. న్యాయస్థానం లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్‌కు జస్టిస్ భట్టు దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు.