AP Govt Vs Employees: బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం హామీ…
AP Govt Vs Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదని, కనీసం తాము దాచుకున్న సొమ్మును కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని చెప్పి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. చాలా కాలంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చూసిన ఉద్యోగులు చివరకు ఉద్యమ బాట పట్టేందుకు సిద్దం అయ్యారు. దీంతో ప్రభుత్వం ఓ మెట్టు దిగి వచ్చింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో హామీ ఇచ్చింది.
సెప్టెంబర్ 30లోగా రెండు విడతల్లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. మొదటి విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా మూడు వేల కోట్లు చెల్లిస్తామని పేర్కొన్నది. అయితే, బకాయిలతో పాటు తాము చేస్తున్న డిమాండ్ల విషయంలోనూ ప్రభుత్వం హామీ ఇవ్వాలని, లేదంటే తాము చేపట్టిన ఉద్యమం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. రేపటి నుండి ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఉద్యమం చేయబోతున్న వేళ నేడు మరోసారి ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నది. ఈ చర్చలను అనుసరించి రేపటి ఉద్యమం ఉండే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఉపాద్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగులు చేపట్టిన ఉద్యమంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.