CM Jagan Tirupati Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
CM Jagan Tirupati Tour:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ఈరోజు తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుపతి జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈరోజు ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు చేరుకోనున్నారు. ఉదయం 11:15 గంటల నుంచి 11:45 గంటల వరకు శ్రీవకుళమాత ఆలయంలో జరిగే ఆలయ సంప్రోక్షణ, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12:05 గంటలకు శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరుకు చేరుకుంటారు. అక్కడ హిల్‌టాప్ సెజ్ ఫుట్‌వేర్ ఇండియా లిమిటెడ్ పాదరక్షల తయారీ కంపెనీ యూనిట్ నిర్మాణ పనులకు సంబంధించి భూమిపూజను నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమం ముగిసిన తరువాత సీఎం జగన్ మధ్యాహ్నం ఒంటిగంటకు ఏర్పేడు మండలంలోని వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్ పరిశ్రమ వద్దకు చేరుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి చేరుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వికృతమాలలో టీసీఎల్ సంస్థ రూ. 1702 కోట్లతో ప్యానల్ ఆప్టో డిస్‌ప్లే టెక్నాలజీ సంస్థను, సెవెన్ హిల్స్ డిజిటల్ పార్కులో సన్నీ ఓపోటెక్ ఇండియా సంస్థ రూ.350 కోట్లతో నెలకొల్పే ప్రాజెక్టును, ఈ పార్క్‌లో ఫాక్స్‌లింక్ ఇండియా ఎలక్ట్రిక్ రూ.355 కోట్లతో నెలకొల్పుతున్న మరో ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించనున్నారు.