AP Police Constable Exam: కానిస్టేబుల్ అభ్యర్థులకు కాసేపట్లో పరీక్ష..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
AP Police Constable Exam: ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని పరీక్షాకేంద్రాలవద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటుచేసింది. పరీక్షకు సమయపాలనను కచ్చితంగా పాటించాలని పోలీసు నియామక మండలి నిర్ణయించింది. నిర్ణీత సమయానికి కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులను ఉదయం తొమ్మిది గంటల నుంచే పరీక్ష సెంటర్‌లోకి అనుమతివ్వనున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది.
పరీక్షా రాసే అభ్యర్థులు తీసుకెళ్లే వస్తువుల కోసం పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదని స్పష్టం చేసింది. వెంట ఎవరైనా వస్తే మీ వసువులు వారివద్దే ఉంచి పరీక్ష హాలులోకి రావాలని సూచించింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు వంటి ఒరిజినల్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని రావాలన్నారు. బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకురావాలి అని పేర్కొంది. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు పరీక్షల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులకి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఉద్యోగాలకు తీవ్రంగా పోటీ నెలకొంది.