Nara Lokesh: అనుమతులు వచ్చినా, రాకపోయినా పాదయాత్ర ముందుకే!
Nara Lokesh Padayatra: చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ముందుగా కుప్పంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభ అనంతరం పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు టిడిపి జిల్లా నేతలు. ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి లోకేష్ పాదయాత్రకు ఇంకా అనుమతులు ఇవ్వలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎవరు అడ్డుకోలేదన్న ఆయన లోకేష్ పాదయాత్ర చేపడుతుంటే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతోందని అన్నారు.
అనుమతులు వచ్చినా, రాకపోయినా పాదయాత్ర కొనసాగిస్తామని పేర్కొన్న ఆయన అసలు పాదయాత్రకు అనుమతులు అవసరమా? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు అనుమతులు తీసుకున్నారా? అని ప్రశ్నించిన అమర్నాద్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఇంటికి పోతుందని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. ఇక నిన్న కుప్పం పార్టీ కార్యాలయంలో శనివారం కుప్పం గ్రామీణ, అర్బన్ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు పీఏ ఒక మీటింగ్ నిర్వహించారు. 175 నియోజకవర్గాల నుంచి పాదయాత్రలో పాల్గొనేందుకు నాయకులు, ప్రజలు తరలి వస్తారని విధులు కేటాయించిన ఇన్‌ఛార్జులు వారికి సక్రమంగా ఏర్పాట్లు చేయాలన్నారు.