GIS 2023: ఏపీలో కోట్లాది రూపాయలు పెట్టబడులు పెడుతున్న అదానీ, అంబానీలు
Adani group will set up two new cement manufacturing plants in AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం మొదలయింది. విశాఖలో గ్లోబర్ ఇన్వెస్టర్ సమిట్ జరుగుతున్న సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఏపీలో తాము ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నామనే విషయాన్ని వెల్లడించారు. అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందకు వచ్చింది. రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు, 15 వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు కరణ్ అదానీ ప్రకటించారు. రిలయెన్స్ కంపెనీ కూడా ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సమాయత్తం అయింది. 10 గిగావాట్ల సోలార్ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టనున్నట్లు స్వయంగా రిలయెన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు.
గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ప్రసంగించిన అంబానీ అనేక కీలక విషయాలు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముందు చూపు కారణంగా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా అవతరించిందని అంబానీ అన్నారు. అదే విధంగా ఏపీలో సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని అభినందించారు. ఏపీలో తమ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందని, 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖేశ్ అంబానీ ప్రకటించారు. పనిలో పనిగా తమ సంస్థకు చెందిన 5జీ నెట్ వర్క్ ఈ ఏడాది చివరి నాటికి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుందని తెలిపారు.
అదానీ కంపెనీ కూడా ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందకు వచ్చింది. కడప, నడికుడిలో సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రారంభించనుంది. సంవత్సరానికి 10 మిలియన్ టన్నులు ఇక్కడి నుంచి ఉత్పత్తి కానున్నాయి. అదే విధంగా విశాఖపట్నంలో 400 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు కూడా చేయనున్నట్లు కూడా కరణ్ అదానీ ప్రకటించారు.