Actor Ali: పవన్ కళ్యాణ్ పై పోటీకి సై అంటున్న ఆలీ
Actor Ali wants to contest against Pawan Kalyan in the Assembly elections
సినీ నటుడు ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పై పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు. అధిష్టానం ఆదేశిస్తే పవన్ తో పోటీ పడతానని తాను సిద్ధమని ఆలీ స్పష్టం చేశారు. 175 స్దానాలకు 175 స్దానాల్లో వైసీపీ గెలుస్తుందని ఆలీ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలోని నగరిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆలీ తన మనసులో మాటను బయట పెట్టారు.
మంత్రి రోజాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. డైమండ్ అనేది చాలా పవర్ పుల్, చాలా ఖరీదైనదని ఆలీ అన్నారు. రోజా ఒక ఫైర్ బ్రాండ్ అని, ఆమె తగ్గేదే లే అని అన్నారు. చిరంజీవి ఫ్యామిలీతో రోజాకు సత్సంబంధాలు ఉన్నాయని, విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం చాలా సాధారణ విషయమని ఆలీ అన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఈ సందర్భంగా ఆలీ అన్నారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసునని, అటువంటి నాయకులనే ప్రజలు ఆదరిస్తారని ఆలీ అన్నారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి మీడియా సలహాదారుగా ఉన్న ఆలీ గత చాలా సంవత్సరాలుగా జగన్ అభిమానిగా ఉన్నారు. వైసీపీ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను ప్రశంసించారు. సీఎం చేస్తున్న అభివృద్ధిని అనేక సందర్భాల్లో ప్రశంసించారు. ఈ క్రమంలో తనకు జిగరీ దోస్త్ అయిన పవన్ కళ్యాణ్ తో విభేదాలు తలెత్తాయి. ఆలీ కూడా తాను ఎంచుకున్న మార్గంపై చాలా స్పష్టతతో ఉన్నారు. వైసీపీ వెంటే ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఏపీ మీడియా సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.