సోమవారం 68,263మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన మొక్కుల ద్వారా స్వామి వారికి 3.65 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Tirumala : తిరుమల (Tirumala)శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు (Devotees) వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
మరోవైపు సోమవారం 68,263మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన మొక్కుల ద్వారా స్వామి వారికి 3.65 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అలాగే ఏడుకొండలవాడికి 28,355 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు.
ఈ ఏడాది అధికమాసం ఉండటం వల్ల సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Salakatla Brahmotsavalu), అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navratri Brahmotsavalu) జరుగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా సెప్టెంబరు 18న ధ్వజారోహణం(Dwajarohanam), సెప్టెంబరు 22న గరుడ వాహనం(Garuda Vahanam).. సెప్టెంబరు 23న స్వర్ణరథం(Swrna Radham).. సెప్టెంబరు 25న రథోత్సవం(Radhotsavam) అంటే మహారథం.. సెప్టెంబరు 26న చక్రస్నానం(Chakra Snanam), ధ్వజావరోహణం( Dwajavarohanam) జరగనున్నట్లు తెలిపారు. అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా అక్టోబరు 19న గరుడవాహనం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబరు 23న చక్రస్నానం జరుగనున్నాయి అని టీటీడీ అధికారులు చెప్పారు.
మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల కారణంగా.. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు, అక్టోబరు 15 నుంచి 23వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ(Unjal Seva), సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం(Arjita Brahmotsavam) సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే నిర్దేశిత వాహనసేవకు అనుమతిస్తారని తెలిపింది. అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ వల్ల అక్టోబరు 14న సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.