Macherla: మాచర్లలో టెన్షన్ వాతావరణం
Macherla:మాచర్ల లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో తెలుగు దేశం శ్రేణులు అనుమానిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో సంతకాలు పెట్టడానికి బ్రహ్మారెడ్డి, టీడీపీ నేతలు మాచర్ల టౌన్ స్టేషన్‌కు వచ్చారు. మరోవైపు మాచర్లలో పోలీసులు కూడా భారీగా మోహరించారు.
గత నెల 16న మాచర్లలో జరిగిన ఘర్షణల నేపధ్యంలో కండిషన్ బెయిల్ పొందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చారు. టిడిపి నాయకుల రాక నేపధ్యంలో వైరీ వర్గాలు ఘర్షణ పడతాయన్న అనుమానంతో 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పట్టణంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
స్టేషన్ పరిసరాల్లోకి మీడియాను సైతం కూడా పోలీసులు రానివ్వడం లేదు. దీంతో బ్రహ్మారెడ్డిని మరో కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మాచర్ల పట్టణంలో వైసీపీ శ్రేణులకు లేని నిబంధనలు టీడీపీ, మీడియా వాళ్లకు అడుగడుగునా ఆంక్షలు విధించడంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న వ్యాపార సంస్థలను కూడా మూసివేయించారు. ఆర్‌టిసి బస్టాండ్‌లోకి సైతం బస్సులు వెళ్లకుండా మరోచోట పార్కింగ్ చేసుకునేలా ఏర్పాటు చేశారు.