Rajahmundry: రాజమండ్రి వద్ద ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ – లింగంపల్లి రైలు రెండు గంటల పాటు ఆలస్యంగా నడువనుంది. అలాగే, విజయవాడ – రాజమండ్రి, కాకినాడ పోర్టు – విజయవాడ, విజయవాడ – విశాఖల మధ్య నడిచే రైళ్ళను పాక్షికంగా రద్దు చేశారు.
రద్దయిన రైళ్లలో విజయవాడ-విశాఖపట్టణం (12718), విశాఖ-విజయవాడ (12717), గుంటూరు-విశాఖ (17239), విశాఖ-గుంటూరు (17240), విశాఖ-విజయవాడ (22701), విజయవాడ-గుంటూరు (07628), గుంటూరు-విజయవాడ (07864), కాకినాడ పోర్ట్-విజయవాడ (17257) రైళ్లు ఉన్నాయి.
కోల్కతాకు వెళ్తున్న రైలు అదుపుతప్పి పట్టాలు తప్పడంతో.. పలు వ్యాగన్లు పడిపోయాయి. ఐఎల్టీడీ ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలులో కార్లు ఉన్నట్లు అధికారులు చెప్పారు. పలు బోగీలు పట్టాలు తప్పి పడడంతో.. కొన్ని కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరికొన్ని స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అలాగే పట్టాలు కూడా ధ్వంసం అవడంతో ఆ రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే చేరుకొని.. మరమ్మతు పనులు చేపట్టారు.