6 Members Died Due to Hightension lines Fall down: ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరెంట్ తీగలు మీదపడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన బొమ్మనహాళ్ మండలం దర్గాహోన్నూరులో జరిగింది. దర్గా హోన్నూర్ గ్రామానికి చెందిన కూలీలు పొలంలో మొక్కజొన్న కంకులు కోతకు వెళుతుండగా విద్యుత్ మెయిన్ వైర్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. కరెంట్ ప్రవహిస్తున్న తీగలు తమ మీద పడటంతో ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని నెలల క్రితం అనంతపురం జిల్లాలోని చిలకొండయ్యపల్లి గ్రామంలో 12 మందితో వెళ్తున్న ఆటోపై విద్యుత్ తీగలు పడ్డాయి. దీంతో ఆరుగురు వ్యవసాయ మహిళా కూలీలు దుర్మరణం చెందడంతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన మరువక ముందే ఇలాంటి మరో ఘటన చోటు చేసుకుంది..