Shocking News: మగబిడ్డకు జన్మనిచ్చిన పద్నాలుగేళ్ల బాలిక
14 Year old girl gave birth to Baby Boy in Annamayya district
ఏపీలో అన్నమయ్య జిల్లాలో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఊహించని ఈ పరిణామం ఉలిక్కిపడేలా చేసింది. గురుకుల పాఠశాలలో చదువుతున్న అమ్మాయి బిడ్డను కనిందనే వార్త తెలియడంతో అధికారులు సీరియస్ అవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరనే విషయం తెలుసుకునే పనిలో పడ్డారు.
హాస్టల్లో చదువుతున్న పద్నాలుగేళ్ల అమ్మాయి గర్భం దాల్చిన విషయం హాస్టల్ అధికారులకు తెలియకపోవడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. బాలిక తల్లిదండ్రులు తిరుపతిలో శ్రీ నగర్లో నివాసం ఉంటున్నారు. తండ్రి ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
వేసవి సెలవులకు ఇంటికి వెళ్లిన సమయంలో ఎవరో అమ్మాయిని లోబరుచుకున్నారని హాస్టల్ అధికారులు భావిస్తున్నారు. పోలీసులకు అదే విషయాన్ని చెప్పారు. అమ్మాయికి పీరియడ్లు రాని విషయం గుర్తించామని, వారి తల్లిదండ్రులకు ఈ విషయం పలు మార్లు చెప్పామని కూడా హాస్టల్ అధికారులు చెబుతున్నారు.
తిరుపతిలో వరదియపాలానికి చెందిన అమ్మాయి, జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ఆమె ఆరవ తరగతిలో ఈ స్కూల్లో చేరింది. అప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువు కొనసాగిస్తోంది. జనవరి 21వ తేదీ మధ్యాహ్నం అమ్మాయికి కడుపు నొప్పి తీవ్రంగా ఉందని తెలియడంతో వాల్మీకి పురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు చేపట్టిన అనంతరం ఆమె గర్భవతి అని నిర్ధారించారు. కొన్ని గంటల వ్యవధిలోనే కాన్పు కూడా చేశారు. 14 ఏళ్ల ఆ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది.
తల్లి, బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం వీరిని తిరుపతిలో రుయా ఆసుపత్రికి తరలించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు కలెక్టర్ విజయరామరాజు వరకు ఈ విషయం వెల్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారకులు ఎవరనే విషయం త్వరలోనే తెలుసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.