YSRCP Four Years Victory : ఏపీలో వైఎస్సార్సీపీ విజయం సాధించి నాలుగేళ్లు పూర్తయింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ స్థానాలు..22 లోక్ సభ సీట్లు విజయం సాధించింది. రాష్ట్రంలో తెలుగుదేశం ఓడించి అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ లో ఎక్కవ స్థానాలు ఉన్న నాలుగో అతి పెద్ద పార్టీగా నిలిచింది. పాదయాత్రలో ఇచ్చిన నవరత్నాల హామీలు తమకు భగవద్గీతగా ప్రమాణ స్వీకారం వేళ ముఖ్యమంత్రి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 95 శాతం హామీలు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో విమర్శలు ఉన్నాయి. మరో ఏడాది కాలంలో ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఇప్పుడు మరోసారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యం కనిపిస్తోంది. వైసీపీ వ్యూహం నెరవేరుతుందా.
2019 లో ఏప్రిల్ 11న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మే 23న ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలు ప్రకటించింది. ఆ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లతో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మే 30న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆరు నెలల కాలంలోనే మార్పు చూస్తారని జగన్ నాడు ప్రకటించారు. అధికారం చేపట్టిన సమయం నుంచి హామీలు నిలబెట్టుకొనేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. హామీలు.. పథకాల అమలు ఆర్దికంగా భారంగా మారాయి. ఇతర డెవలప్ మెంట్ కార్యక్రమాలు..ఇతర నిధులను పూర్తిగా సంక్షేమం కోసం వినియోగించాల్సి వచ్చింది. కరోనా సమయం..ఆర్దిక కష్టాలు ఉన్నా తాము చెప్పిన మేరకు సంక్షేమం అమలు చేసామంటై ముఖ్యమంత్రి జగన్ తో సహా వైఎస్సార్సీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.
సంక్షేమం కోసం ఈ నెల 47 నెలల పాలనలో 2.10 లక్షల కోట్ల మేర లబ్ది దారులకు మేలు చేసామని ప్రభుత్వంలోని నేతలు చెబుతున్నారు. ఈ పాలనలో ప్రధానంగా తీసుకున్న నిర్ణయాల్లో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసి.. వలంటీర్ల వ్యవస్థ ప్రధనంగా కనిపిస్తోంది. 13 జిల్లాల ఏపీ 26 జిల్లాలు రూపాంతరం చెందింది. నాడు నేడు పథకం దవారా పాఠశాలలు..ఆస్పత్రుల రూపు రేఖలు మారుస్తామని చెప్పినా అది పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. ఎన్నికల సమయంలో దశల వారీగా మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చినా అ దిశగా అడుగులు పడటం లేదు. మద్యం ఆదాయం పైన ప్రభుత్వం రుణాలు తీసుకుంది. ఆర్దికంగా కష్టాలు ప్రతీ రోజు సర్వసాధారణంగా మారాయి. అప్పులు పెరిగిపోతున్నాయి. అప్పులు తెచ్చి పేదలకు పంచుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.
అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో తీసుకున్న నిర్ణయం మూడు రాజధానులు. అమరావతి ని చంద్రబాబు భ్రమరావతిగా మార్చారని.. పెద్ద ఎత్తున అవినీతి జరిగిదంటూ మంత్రి వర్గ ఉప సంఘాలతో పాటుగా సీఐడీతో విచారణ చేయించారు. అనేక కేసులు నమోదు చేసారు. విశాఖ పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించారు. అసెంబ్లీలో బిల్లులు ఆమోదం వివాదాస్పదంగా ముగిసింది. దీనికి వ్యతిరేకంగా అమరావతి వాసులు హైకోర్టును ఆశ్రయించారు. తీర్పుకు ముందు ప్రభుత్వం తమ బిల్లులను ఉప సంహరించుకుంది. అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారం పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ పెండింగ్ లో ఉంది.
రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ పైన విమర్శలు ఉన్నాయి. ఉద్యోగులు తమకు విడుదల చేయాల్సిన నిధులను వినియోగించుకుందంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీలో రెబల్స్ పెరిగపోతున్నారు. ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారారు. తమకు ప్రాధాన్యత దక్కటం లేదని ఎంపీలు, ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఈ సారి ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో జగన్ ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. బీజేపీ తమ నిర్ణయం ఇంకా వెల్లడించలేదు. తాము సింగిల్ గానే పోటీ చేస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించింది.
తాము అందించిన సంక్షేమం తమను గెలిపిస్తుంది జగన్ ధీమాగా ఉన్నారు. రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ప్రాంతాలు..సామాజిక సమీకరణాల లెక్కలతో 2024 ఎన్నికలు ఏపీలో పార్టీలు సిద్దం అవుతున్నాయి.