Power Cuts in AP: విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విఫలమవుతంది. ఒక వైపు పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్న వేళ కరెంటు కోతలు మొదలయ్యాయి. అనధికారిక కోతలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అనధికారిక విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ఇవి కోతలు కావని..సాంకేతిక సమస్యగా అధికారులు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కోతలు అమలు అవుతున్న ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభించాయి. వీటీపీఎస్ లో అయిదు గంటల పాటు సమస్య ఏర్పడింది. రికార్డు స్థాయిలో విద్యుత్ కు డిమాండ్ ఏర్పడింది. దీంతో అధికారుల అంచనాలు తారుమారు అవుతున్నాయి.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డు నమోదైంది. 255 ఎంయూల డిమాండ్ ఏర్పడింది. 6.35 ఎంయూల లోటు సర్దుబాటుకు రాష్ట్ర వ్యాప్తంగా కోతలు విధించింది. రియల్ టైం మార్కెట్ లో 12.38 ఎంయూలు, డే ఎహెడ్ మార్కెట్ నుంచి 21.2 ఎంయూల విద్యుత్ ను డిస్కంలు కొన్నాయి. మరో 21 ఎంయూల విద్యుత్ ను స్వల్ప కాలిక ఒప్పందాల ద్వారా సర్దుబాటు చేసాయి. అధికారులు అంచనా వేసిన దాని ప్రకారం ఏప్రిల్ లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 250 ఎంయూలకు చేరుతుందని అంచనా వేసారు.
ఏప్రిల్ నెల సర్దుబాటు చేస్తే తర్వాత నుంచి వ్యవసాయం వినియోగం తగ్గుతుందదని అధికారులు భావించారు. దీనికి అనుగుణంగా 230 ఎంయూల విద్యుత్ సమకూర్చుకునే విధంగా ప్రణాళికలు సిద్దం చేసారు. కానీ, అంచనాలకు మించి 25 ఎంయూల డిమాండ్ ఎక్కువగా నమోదైంది. ఒక వైపు విద్యుత్ ఛార్జీల పెంపు, ట్రూ అప్ పేరుతో ప్రజల పై భారం మోపుతున్నా అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయటంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నా..అనేక ప్రాంతాల్లో అనధికారికంగా కోతలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో విజయవాడ వీటీపీఎస్ లో ఆరు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. పునరుద్దరణకు 5 గంటల సమయం తీసుకుంది.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో బుధవారం 248.985 ఎంయూల విద్యుత్ ను సరఫరా చేసామని ఇందన శాఖ వెల్లడించింది. వీటీపీఎస్ లో తలెత్తిన సమస్య కారణంగా ఆరు యూనిట్లలో 1,550 మెగావాట్ల ఉత్పత్తి నిలిచినా..రికార్డు స్థాయి డిమాండ్ మేరకు డిస్కంలు సరఫరాల చేసాయని పేర్కొంది. వడగాల్పుల కారణంగా వారం రోజులుగా డిమాండ్ రోజుకు 245-249 ఎంయూల మధ్య ఉంటోందని ఇంధన శాఖ వివరించింది. ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నామని, సాంకేతికంగా ఏర్పడిన సమస్యల కారణంతోనే సరఫరా నిలిచినట్లు వివరించారు. శ్రీశైలం రిజర్వాయర్ లో నీటి మట్టం లేని కారణంగా జలవిద్యుత్తు ఉత్పత్తి సాధ్యం కావటం లేదు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా దెబ్బతిని విద్యుత్ లైన్లలో సమస్యలు వస్తున్నాయని విశ్లేషించింది.
ఇటు విద్యుత్ కోతల పైన నిరసనలు మోదలయ్యాయి. వేళపాలా లేని విద్యుత్ కోతలను ప్రజలు ఆగ్రహిస్తున్నారు. సబ్ స్టేషన్ల ముందు ఆందోళనలకు దిగుతున్నారు. టీడీపీ నేతలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు పాలకొల్లులో ఓ విద్యుత్ సబ్ స్టేషన్ ముందు లాంతర్ల వెలుగులో మడత మంచం వేసుకొని పడుకున్నారు. అదే విధంగా పలు జిల్లాల నుంచి పిర్యాదు కేంద్రాలకు విద్యుత్ సరఫరా పునరుద్దరించాలంటూ సామాన్యుల నుంచి సందేశాలు వస్తున్నాయి. దీంతో..ఇటు ఉక్కపోత..అటు కరెంటు కోత సమస్యగా మారుతోంది.