అవినాష్ రెడ్డి bail వ్యవహారం ఈరోజు ఒక కొలిక్కి రానుంది.. తెలంగాణా హై కోర్టు ఉదయం 10.30 కు వాదనలు వినబోతుంది.. అవినాష్ అరెస్ట్ అవుతాడా బెయిల్ వస్తుందా అన్నదానిపై ఇప్పటికే బెట్టింగులు కూడా మొదలయ్యాయి..
Avinash Reddy Case: అవినాష్ రెడ్డి కేసులో ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. నిన్న తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను నేటికి వాయిదా వేసింది. ఇరు వర్గాల వాదనలు విని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు నిర్ణయం తీసుకోనున్నది. కర్నూలులోకి విశ్వభారతి వద్ద ఇంకా అవినాష్ రెడ్డి అనుచరులు బైఠాయించే ఉన్నారు. కోర్టు తీర్పును అనుసరించి అక్కడి పరిస్థితులు మారనున్నాయి. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తే ఆయన్ను అదుపులోకి తీసుకోక తప్పదు. అప్పుడైనా కర్నూలు పోలీసులు సహకరిస్తారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ సహకరిస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, సహకరించకుండా ఉంటే సీబీఐ అనుకున్న విధంగా కేంద్రబలగాల సాయంతో ఆయన్ను అదుపులోకి తీసుకుంటుందా లేదంటే, వెనకడుగు వేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.
ఇప్పటి వరకు తన తల్లి అనారోగ్యం కారణంగా దగ్గర ఉండాలని అవినాష్ రెడ్డి చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడిందని, ఐసీయు నుంచి జనరల్ వార్డుకు తరలిస్తున్నామని విశ్వభారతి ఆసుపత్రి వర్గాలు బులిటెన్‌ను విడుదల చేశాయి. కాగా, ఆరోగ్యం కుదురుగానే ఉండటంతో అవినాష్ రెడ్డి నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరం. ఈకేసును జూన్ 30 వరకు పూర్తి చేయాలని సుప్రింకోర్టు డెడ్‌లైన్ విధించింది. దీనిప్రకారమే సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తున్నది. కాగా, ముందస్తు బెయిల్‌కు అనుమతి ఇవ్వద్దని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ వాదిస్తున్నది. అటు వైఎస్ వివేకా కూతురుకూడా ఇదే విధంగా వాదిస్తూ ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి.