Palandu Politics: పల్నాడు రాజకీయాలు మీసం మెలేస్తున్నాయి. తొడ గొట్టి సవాళ్లు విసురుతున్నాయి. రాజకీయంగా ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పల్నాడు జిల్లాలో టీడీపీ, వైఎస్సార్సీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పల్నాడులో 2019 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ గెలిచింది. ఈ సారి టీడీపీ ఆ నియోజకవర్గాల్లో జెండా ఎగరేయాల నే పట్టుదలతో ఉంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ పట్టు నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, సవాళ్ల రాజకీయం తారా స్థాయికి చేరింది.
వినుకొండల ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మీసం మెలేసీ టీడీపీ శ్రేణులకు సవాల్ విసిరారు. లోకేష్ పాదయత్ర 100వ రోజు సందర్భంగా నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర నిర్వహించాయి. ఆ సమయంలో వినుకొండలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వాహనం కనిపించింది. వెంటనే టీడీపీ కార్యకర్తలు తమ పార్టీ…నేతలకు అనుకూలంగా నినాదాలు చేసారు. ఎమ్మెల్యే కారుకు అడ్డుపడి ఘెరావ్ చేసారు. దీనికి స్పందించిన బ్రహ్మనాయుడు సీరియస్ అయ్యారు. దమ్ముంటే రండి అంటూ మీసం మెలేసారు. పోలీసులు జోక్యం చేసుకొని ఎమ్మెల్యేతో పాటుగా టీడీపీ శ్రేణులను అక్కడి నుంచి పంపించారు.
పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా రాజకీయం మారుతోంది. అక్కడ ఎమ్మెల్యే పిన్నెళ్లి వర్సస్ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ జూలకంటి వర్గాల మధ్య రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో పిన్నెళ్లిని ఓడిస్తానంటూ జూలకంటి సవాల్ చేసారు. కొద్ది రోజుల క్రితం మాచర్లలో టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారాయి. ఆ తరువాత పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేసారు. 144 సెక్షన్ అనేక రోజులు అమలు చేయాల్సి వచ్చింది. పలువురి టీడీపీ నేతల అరెస్ట్ లు జరిగాయి. ఈ సారి ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరుతో రాజకీయంగా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ అరవింద్ మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. డాక్టర్ గోపిరెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. ఈ సారి తనకు సీటు ఖాయమైతే గెలిచి చూపిస్తానని అరవింద్ చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య ఇక్కడ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పల్నాడులో రాజకీయాల పైన ఇద్దరు నేతలు సవాళ్లు చేసుకున్నారు. కోటప్పకొండ దేవాలయంలో చర్చకు సవాల్ చేయటం ద్వారా గతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యర్ధి పార్టీల పైన దాడులు, కేసులతో రెండు పార్టీల మధ్య సవాళ్ల సవారీ కొనసాగుతోంది.
గురజాలలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. ఎమ్మెల్యే కాసు మహేష్ వర్సస్ మాజీ ఎమ్మెల్యే యరపతినేని సవాళ్లతోనే రాజకీయం కొనసాగిస్తున్నారు. తమ వర్గంలో పట్టు నిలబెట్టుకొనేందుకు ఇద్దరు నేతల ప్రకటనలు పలు మార్లు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. అభివృద్ధి విషయంలో ఇద్దరూ సవాళ్లు చేసుకున్నారు. అవినీతి పైన భారీ స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. గురజాలలో ఈ సారి ఎలాగైనా మరోసారి గెలవాలని ఎమ్మెల్యే కాసు, తన పట్టు నిరూపించుకొనేందుకు యరపతినేని నియోజకవర్గ పరిధిలో ప్రతీ గ్రామంలో పర్యటనలు చేస్తున్నారు. రాజకీయంగా సున్నిత ప్రాంతాలైన పల్నాడు నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఎన్నికల టెన్షన్ ఉంది.
ఇలా రాజకీయంగా పట్టు నిరూపించుకొనే క్రమంలో నేతల సవాళ్లు..ప్రతి సవాళ్లతో పల్నాడు రాజకీయం అదుపు తప్పుతోంది. తాజాగా జరుగుతున్న పోరు ఎటువైపు మలుపు తిరుగుతుందోననే చర్చ నడుస్తోంది.