మాజీ మంత్రి పేర్నినాని తన రాజకీయ రిటైర్మెంట్ ను ప్రకటించారు. సీఎం జగన్ బందర్ పోర్టు శంకుస్థాపన తరువాత సభలో పాల్గొన్నారు
Perni Nani Decision: మాజీ మంత్రి పేర్నినాని తన రాజకీయ రిటైర్మెంట్ ను ప్రకటించారు. సీఎం జగన్ బందర్ పోర్టు శంకుస్థాపన తరువాత సభలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని తన ప్రసంగంలో ముఖ్యమంత్రి ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసారు. తాను ఇక రిటైర్మెంట్ తీసుకుంటున్నానని స్పష్టం చేసారు. జగన్ తో మరో మీటింగ్ ఉంటుందో లేదో తెలియదంటూ కామెంట్ చేసారు. వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని పోటీ చేయటానికి ఆసక్తిగా లేరంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి పాల్గొన్న సభలోనే పేర్ని నాని తన నిర్ణయం వెల్లడించారు.
బందరులో జరిగిన సభలో పేర్నినాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కలకలంగా మారాయి. పేర్ని నాని బందరు నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో తన కుమారుడికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని గతంలో సీఎం ను కోరారు. ఈ విషయాన్ని గడప గడపకు ప్రభుత్వం సమీక్షలో స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. పేర్ని నాని, బుగ్గన తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వమని కోరుతున్నారని, ఈ సారికి వాళ్లే పోటీ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఆ సమయంలో వారసులకు ఈ సారి ఎన్నికల్లో వైసీపీ నుంచి సీట్లు దక్కుతాయా లేదా అనే చర్చ సాగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి తన నియోజకవర్గానికి రావటంతో మరోసారి పరోక్షంగా పేర్ని నాని తన మనసులో మాట బయట పెట్టారు.
ముఖ్యమంత్రి నిర్ణయాల గురించి పేర్ని నాని ప్రస్తావన చేసారు. వయసులో చిన్నవాడు అయిపోయాడు లేదంటే పాదాభివందనం చేసి ఉండేవాడిని అన్నారు. తాను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకుని వస్తున్న ముఖ్యమంత్రికి చేతులు ఎత్తి దండం పెడుతున్నానని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ ఏదో ఒక బటన్ నొక్కుతూనే ఉంటారు ముఖ్యమంత్రి ..ఏదో ఒక వర్గానికి సంక్షేమం అందిస్తూనే ఉంటారన్నారు. పోర్టు నిర్మాణానికి రాక్షసుడిలా చంద్రబాబు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఆ పీటముడులు తీయటానికి నాలుగేళ్లు పట్టిందన్నారు. 2014లో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నామినేషన్ వేసే వారం రోజుల ముందు పోర్టుకు శంఖుస్థాపన చేశాని పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం గోల్డ్ కవరింగ్ పరిశ్రమకు కరెంట్ కు విద్యుత్ ఛార్జీలు తగ్గించారన్నారు.
జగన్ తో కలిసి మరో మీటింగ్ ఉంటుందో లేదో తెలియదని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలతో ఇదే చివరి సమావేశమనే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే బందరులో వైసీపీ కార్యక్రమాల్లో పేర్ని నాని కుమారుడు కిట్టు క్రియాశీలకంగా మారారు. నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. వైసీపీ అభ్యర్ధిగా పేర్ని కుమారుడే పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు పేర్ని నాని తన సమక్షంలోనే ఇటాంటి కామెంట్స్ చేసినా వీటి పైన ముఖ్యమంత్రి జగన్ స్పందించ లేదు. పేర్ని నాని కాపు సామాజిక వర్గం నుంచి వైసీపీలో ముఖ్య నేతగా ఉన్నారు. ఇప్పుడు పేర్ని నాని తన నిర్ణయం వెల్లడించటంతో ముఖ్యమంత్రి ఆమోదం పైన స్పష్టత రావాల్సి ఉంది.