AP Politics: ఏపీలో పొత్తుల రాజకీయం నడుస్తోంది. వైసీపీకీ వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీతో జత కట్టేందుకు పవన్ కల్యాణ్ సిద్దమయ్యారు. పవన్ పైన వైస్సార్సీపీ నేతలు విమర్శల పదును పెంచారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు ఆసక్తి కరంగా ఉన్నాయి. వైసీపీ తమకు పొత్తులతో భయం లేదంటోంది. తాము సింగిల్ గానే పోటీ చేస్తామని ప్రకటించింది. కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ బలం పైన చర్చ మొదలైంది. ఏపీ కేంద్రం గా సాగుతున్న పొత్తులాటలో పరిణామాలు ఆసక్తిగా మారాయి.
పొత్తుల పైన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతోందన్నారు. టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదన పవన్ తీసుకొచ్చారని చెప్పారు. ఇదే విషయాన్ని తమ పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లామని..పవన్ కల్యాణ్ కూడా మాట్లాడుతున్నారని వివరించారు. పొత్తుల పై అంతిమ నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వానిదేనని స్పష్టం చేసారు. కర్ణాటక ఎన్నికల్లో పరాజయం తరువాత తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్య నిర్ణయాలతో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో పొత్తుల పైన ఏపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. పొత్తులు చూసి భయపడే అవసరం వైసిపికి లేదన్నారు. రాజకీయంగా తాము టిడిపి లాగా ఊత కర్ర పట్టుకుని నడిచే స్థితిలో లేమని వ్యాఖ్యానించారు.
2019 లో చేసిన విధంగానే 2024లోనూ ఒంటరిగా పోటీ చేస్తానని వివరించారు. ఎవరు కలిసి పోటీ చేసినా వచ్చే తమకు ఇబ్బంది లేదన్నారు. 2019 లో వచ్చిన 151 సీట్ల కంటే 2024లో ఇంకా ఎక్కువ వస్తాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేసారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తే ఆయన గెలుస్తారో లేదో చూడాలన్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ తాము రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులకు సిద్దం అవుతున్నామన్నారు. టీడీపీ, బీజేపీతో చర్చలు జరిగాయని సీట్ గురించి మాత్రం మాట్లాడలేదన్నారు. మూడు పార్టీలు కలవటం ద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండా చూడటమే తమ లక్ష్యమని మనోహర్ పేర్కొన్నారు.
తెలుగు దేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నారన్నారు. తానొక్కడినే తెలివైన వాడినని పవన్ అనుకుంటారని పేర్కొన్నారు. జగన్ ను తిట్టడటం కోసమే పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకు వస్తుంటారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు ఆదేశాలతో పవన్ డైలాగులు ఉంటాయన్నారు. ఎవరో టీ కొట్టు అతను వ్యాన్ ఇస్తే వారాహి అని పేరు పెట్టారని వ్యాఖ్యానించారు. ఆ వారాహి ఏమైందని ప్రశ్నించారు. ప్రజలను, కాపులను కూడా కలిపి తిడుతున్నారని..పట్టుమని పది రోజులైనా రాష్ట్రంలో ఉండి ప్రజల కోసం పని చేశారా అని నిలదీసారు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబం పై చంద్రబాబు దాష్టికం చేశారని ఆరోపించిన పేర్ని నాని అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు.