BJP – YSRCP in AP Politics: ఏపీలో పొత్తుల ప్రభావం మొదలైనట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ..బీజేపీతో జనసేన పొత్తులు ఉంటాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. బీజేపీతో పొత్తు దిశగా చేసిన ప్రయత్నాలను వెల్లడించారు. కలిసి రాకపోతే ఒప్పిస్తామని నమ్మకంగా చెప్పుకొచ్చారు. ఇంకా బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసే అంశం పైన నిర్ణయం ప్రకటించలేదు. బీజేపీ నిర్ణయం కోసం టీడీపీ వేచి చూస్తోంది. ఇప్పుడు బీజేపీ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ మాజీ మంత్రి కొడాలి నాని లక్ష్యంగా కామెంట్స్ చేసారు. దీనికి కొడాలి నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కౌంటర్లు..ఎన్ కౌంటర్లు ఏపీ రాజకీయాల్లో సీరియస్సా లేక జస్ట్ ఫర్ పాలిటిక్స్ గా మారాయా అనే చర్చ మొదలైంది.
బీజేపీ ఏపీ వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం పైన ఛార్జ్ షీట్ దాఖలు చేస్తోంది. అందులో భాగంగా గుడివాడలో జరిగిన కార్యక్రమంలో ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని పైన సంచలన కామెంట్స్ చేసారు. కొడాలి నాని బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు వారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను నాని క్యాసినో, క్యాబిరే డ్యాన్స్ లుగా మార్చేశారని సునీల్ దుయ్యబట్టారు. గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్న కొడాలి నాని ఇక జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా ప్రజలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏపీలో జగన్ జగన్, ఆయన మంత్రిమండలి ఆలీబాబా నలభై దొంగల మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. గుడివాడలో తాగునీటికి కేంద్రం ఇచ్చిన నిధులను మింగేసారని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకొస్తే కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామని సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యల పైన కొడాలి నాని స్పందించారు. సునీల్ ఒక పకోడి అన్న ఆయన.. అతనిలాంటి పకోడీల వల్లే కర్ణాటకలో బీజేపీకి ఆ పరిస్ధితి వచ్చిందన్నారు. సునీల్ లాంటి వ్యక్తులు ఏపీకి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వున్న సునీల్ దియోధర్ లాంటి బీజేపీ నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సూచించారు.
2018 లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలకు వైసీపీ దగ్గరమైంది. గత నాలుగేళ్లుగా వైసీపీ..బీజేపీ మధ్య అనధికార పొత్తు కొనసాగుతుందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు మరోసారి ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పవన్ కల్యాణ్ మరోసారి 2014 లో పోటీ చేసిన విధంగా ఇప్పుడు పొత్తుల ప్రతిపాదన చేసారు. టీడీపీతో జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత వచ్చిన తరువాత తరువాతి అడుగులు వేయాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. ఈ సమయంలో బీజేపీ ముఖ్య నేత వైసీపీలో కీలకంగా ఉన్న కొడాలి నాని పైన ఈ తరహా వ్యాఖ్యలు చేయటంతో రాజకీయంగా కొత్త లెక్కలకు తెర లేచింది. బీజేపీ పొత్తులపైన నిర్ణయం ప్రకటిస్తే ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్దం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.