తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తుది విచారణ నేడు జరగనున్నది. దీనిపై కీలకమైన తీర్పును కూడా హైకోర్టు నేడు వెలువరచనున్నది. ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు ఉత్కంఠ నెలకొన్నది.
Avinash Reddy: ఒక సినిమాకు ప్రీ క్లైమాక్స్ బలంగా ఉత్కంఠభరితంగా ఉంటే క్లైమాక్స్ అంత అద్భుతంగా ఉంటుంది. ఒక సినిమా హిట్ కావాలంటే నవరసాలు సమపాళ్లలో ఉండాలి. అంతకు మించి ఎంచుకున్న కథలో దమ్ముండాలి. ఇవన్నీ అవినాష్ రెడ్డి పొలిటికల్ స్టోరీలో సమృద్దిగా ఉన్నాయి. 2019 ఎన్నికల ముందు నుంచి ఆయన లైఫ్‌లో జరిగిన సంఘటనలను తీసుకొని పేర్చుకుంటూ పోతే ఓ మంచి సినిమా అవుతుంది. ఇలాంటి సినిమా నేడు క్లైమాక్స్‌కు చేరుకుంది. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తుది విచారణ నేడు జరగనున్నది. దీనిపై కీలకమైన తీర్పును కూడా హైకోర్టు నేడు వెలువరచనున్నది. ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు ఉత్కంఠ నెలకొన్నది.
గత నాలుగు రోజులుగా కర్నూలు ఆసుపత్రి నుంచి బయటకు రాకుండా తల్లిని చూసుకుంటున్న అవినాష్ రెడ్డి భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనున్నది. ఆయనకు ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదంటే బెయిల్ పిటీషన్‌ను కొట్టివేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇటు సీబీఐ అధికారులు కూడా బెయిల్ పిటిషన్‌ను రద్దు కొట్టివేయాలని పదేపదే వాదిస్తూ వస్తున్నది. ఇప్పటికే ఆయన మూడుసార్లు విచారణకు హాజరుకాకుండా గైర్హాజరయ్యారు. మూడుసార్లు గైర్హాజరైతే సీబీఐ అదుపులోకి తీసుకునే అధికారం ఉంది.
మూడు రోజుల క్రితం సీబీఐ అధికారులు కర్నూలుకు వచ్చినప్పటి నుంచి అసలు డ్రామా మొదలైంది. విశ్వభారతి ఆసుపత్రి ఈ డ్రామాకు వేదికగా మారింది. అవినాష్ రెడ్డి అనుచరులు, పార్టీ కార్యకర్తలు పాత్రధారులు కాగా, పోలీస్ యంత్రాంగం ప్రధాన సూత్రధారుల పాత్రను పోషించారు. సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు సహకరించాలని కర్నూలు ఎస్పీని కోరగా, డీజీపీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు తానేమి చేయలేనని సహాయనిరాకరణ ప్రకటించారు. ఇక, విశ్వభారతి ఆసుపత్రి వద్ద అయినవారికి వెండికంచాల్లో వడ్డించిన చందాన అధికార పార్టీ నేతలు, అమాత్యులకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చే సామాన్యుల గోడును పట్టించుకోకుండా తమకు కావలసిన వారికే రాచమర్యాదలు చేస్తున్నారు.
పోలీసుల తంతు ఈ విధంగా ఉంటే, పార్టీ నాయకుల వ్యవహారం మరోవిధంగా ఉంది. ఆసుపత్రి గేటుబయట కూర్చొని సీబీఐకి వ్యతిరేకంగా, మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలు, అవినాష్ రెడ్డి అనుచర వర్గానికి పార్టీ నేతలు సపర్యలు చేస్తున్నారు. కూర్చున్న చోటికే రోటి, పుల్కా, సంకటి వంటివి తెచ్చిపెడుతున్నారు. కర్నూలులో జరుగుతున్న సంఘటనలు చూస్తే ఎవరైనా షాకవ్వడం ఖాయం. తప్పు చేయనపుడు చట్టపరంగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించాలనిగాని, ఇలా సహకరించకుండా తప్పించుకు తిరగాలని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఎన్నాళ్లు ఇలా ఆసుపత్రిలో నుంచి బయటకు రాకుండా ఉంటారు. సమయాన్ని వృధా చేసేకొద్ది కేసు మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది.
సీబీఐ అధికారులు కేంద్ర బలగాల సాయం తీసుకుంటున్నారని వార్తలు బయటకు రాగానే అవినాష్ రెడ్డి అనుచరగణం వ్యవహారం మరోలా మారిపోయింది. సెంటిమెంట్‌తో పడగొట్టాలని చూస్తున్నారు. అమ్మ ప్రేమను అర్థం చేసుకోండి… అవినాష్ రెడ్డి సమయం ఇవ్వండి అంటూ ప్లకార్డులు పట్టుకొని కూర్చున్నారు. కర్నూలు డ్రామాలో సెంటిమెంట్‌ను పండించాలని చూస్తున్నారు. అటు సుప్రింకోర్టు తలుపుతట్టి అర్జెంట్ అంటూ పిటిషన్లు దాఖలు చేసినా తీరు చర్చనీయాంశం. అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ముందస్తు బెయిల్ విషయం హైకోర్టులో తేల్చుకోవాలని, హైకోర్టు నాన్చకుండా గురవారం తీర్పు ఇవ్వాలని ఆదేశించింది.
దీంతో ఈ ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టులో నేడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌కు సంబంధించి వాదనలు జరుగున్నాయి. ఈ డ్రామాకు హైకోర్టు నేటితో చెక్ పెట్టి నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశమే హాట్ టాపిక్‌గా మారింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తే పరిస్థితి ఏంటి? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? సీబీఐని ముప్పు తిప్పలు పెట్టిన అవినాష్ రెడ్డి లొంగిపోతాడా..? కర్నూలు పోలీసులు సీబీఐకి సహకరిస్తారా? లేదంటే కేంద్ర బలగాలను వెంటపెట్టుకొని వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం మరికాసేపట్లోనే తెలిపోతుంది.