BJP Executive Committee Meeting: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సామవేశం నేడు జరగనుంది. రాష్ట్ర ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి మురళీధరన్ ఇందులో పాల్గొంటారు. తాజాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పైన పవన్ కల్యాణ్ చేసిన ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదన పైన పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ముఖ్య నేతలు చెబుతూ వచ్చారు. ఏపీకి వచ్చిన మురళీధరన్ రాష్ట్ర నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. పార్టీ హైకమాండ్ మూడ్ పైనా సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ ఆలోచనల్లో మార్పు వచ్చిందనే వాదన వినిపిస్తోంది. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొసాగుతోంది. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పని చేసేందుకు నిర్ణయించారు. తమతో బీజేపీ కూడా కలిసి వస్తుందనే అంచనాతో ఉన్నారు. కలిసి రావాలని బీజేపీ ముఖ్య నేతలను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు ప్రతిపాదన చేసారు. కర్ణాటక ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావించారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ నాయకత్వం దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల పైన కసరత్తు ప్రారంభించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలోనే రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. రాష్ట్ర నేతలు ఈ ప్రతిపాదన పైన తమ అభిప్రాయం స్పష్టం చేసే అవకాశం ఉంది. జనసేనతో పొత్తుపైన అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారు.
టీడీపీతో పొత్తు పైన ఏపీ బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీతో పొత్తు కారణంగా పార్టీ నష్టపోయిందని ఒక వర్గం వాదిస్తోంది. ఏపీ బీజేపీలో టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నాయనే వాదన ఉంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు రానున్న ఎన్నికల్లో పొత్తులు అవసరమే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పైన ఆరోణలు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ, ఢిల్లీలోని బీజేపీ ముఖ్య నేతల మధ్య కొనసాగున్న సాన్నిహిత్యంతో పార్టీ నష్టపోతోందని వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. రెండో వర్గం మాత్రం టీడీపీతో మరో సారి పొత్తు పెట్టుకుంటే పార్టీకి భవిష్యత్ ఉండదని వాదన చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తమతోనే పొత్తులో కొనసాగుతూ టీడీపీతో చర్చలు చేయటం పైన చర్చ మొదలైంది.
పవన్ కల్యాణ్ ఇప్పుడు పొత్తుల పైన చేసిన ప్రతిపాదన పైన హైకమాండ్ దే తుది నిర్ణయమని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పవన్ ఢిల్లీ పర్యటన సమయంలో మురళీధరన్ తోనూ సమావేశం అయ్యారు. పవన్ ప్రతిపాదన పైన తాను హైకమాండ్ తో చర్చిస్తానని మురళీధరన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు జరిగే సమావేశంలో పవన్ ప్రతిపాదనతో పాటుగా కేంద్ర మూడ్ ఏంటనేది పార్టీ నేతలకు వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు నిర్ణయం ప్రకటించే అవకాశాలు మాత్రం లేవని తెలుస్తోంది. ఇదే సమావేశంలో ఈ నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.