Heat Waves in AP: ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పలు ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ రోజు రేపు పలు మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. సోమవారం 127 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మంగళవారం కూడా 190 మండలాల్లో వడగాలులు తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ఠారెత్తిస్తున్న ఎండలతో ప్రజలు బయటకు రావటానికి జంకుతున్నారు.
రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేసారు. ప్రధానంగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, పల్నాడు, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. దాదాపు అన్నిచోట్లా 40-44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. అనకాపల్లి, విశాఖ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 44.8 డిగ్రీలు నమోదైంది. ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.7, కామవరపుకోటలో 44.5, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో 44.4, ఏలూరు జిల్లా రాజుపోతేపల్లిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు విపత్తుల శాఖ వెల్లడించింది.
వాతావరణంలో తేమలేని పొడిగాలులు వీస్తుండడంతో తీవ్రమైన ఉక్కపోత, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాజస్థాన్, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం లేకపోవడంతో ఉక్కపోత, ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. తుఫాను తగ్గినా ఆ ప్రభావంతో పెరిగిన ఉష్ణోగ్రతల తీవ్రత మరో నాలుగు రోజుల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేసారు. సోమవారం 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు,173 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. రేపు 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని, ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సోమవారం విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసారు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తా జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలతో పాటుగా వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.