NTR 100th Birthday: ఎన్టీఆర్ ఆ పేరు ఒక ప్రభంజనం. కధనాయకుడిగా..ప్రజా నాయకుడిగా..ఏ రంగంలో అయినా అందరినీ కట్టిపడేసే సమ్మోహనా శక్తి ఎన్టీఆర్ సొంతం. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు, శివుడు, రావణుడు, దుర్యోధనుడు, భీముడు పాత్రల్లో నటించి ప్రభావితం చేసారు. తన ప్రత్యేక శైలితో ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ’ అనిపించుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఒక సంచలనం. టీడీపీ ఏర్పాటు తెలుగు గడ్డ పై ఒక రాజకీయ మలుపు. అన్నా అంటూ అందరితో ఆప్యాయంగా పిలిపించుకున్న..ఇప్పటికీ అన్న గారు అంటూ గౌరవంగా చెప్పుకొనే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు మూడు తరాలకు స్ఫూర్తినిచ్చిన మంత్రాక్షరాలు. రాబోయే తరాలకు స్పూర్తి మంత్రాలు. లబ్దప్రతిష్టులైన సినీ నటులు ఎందరు ఉన్నా… తనకంటూ ఒక ప్రత్యేక ఒరవడిని సంపాదించుకున్న ఎన్టీఆర్ తెలుగు నాట సినీ..రాజకీయ వారసత్వానికి బీజాలు వేసారు. తొలి చిత్రం ‘మనదేశం’ (1949) నుండి చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్'(1993) వరకు (చివరిగా విడుదలైన చిత్రం ‘శ్రీనాథ కవి సార్వభౌముడు’) నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే మరియు కథా రచయితగా రాణించిన నటరత్న ఎన్టీఆర్… పద్మశ్రీ, కళాప్రపూర్ణ, డాక్టర్ బిరుదులను కైవసం చేసుకున్నారు. ఎన్టీఆర్ ను పౌరాణిక పాత్రల్లో చూసిన వారు ఆ పాత్రల కోసమే ఎన్టీఆర్ పుట్టారా అన్నట్లు ఆనందించే వారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే మరియు కథా రచయితగా రాణించిన నటరత్న ఎన్టీఆర్… పద్మశ్రీ, కళాప్రపూర్ణ, డాక్టర్ బిరుదులను కైవసం చేసుకున్నారు.
సినిమాల్లోకి రాకముందు ముంబైలో నెలరోజులపాటు మెస్ నడిపారు ఎన్టీఆర్. కొన్నాళ్ళు పొగాకు వ్యాపారం చేసారు. మరి కొన్నాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ నడిపి నష్టపోయారు. ఇంటర్ చదివేటప్పుడే కుటుంబానికి చేదోడుగా సైకిల్ మీద తిరుగుతూ హోటళ్లకు పాలు పోశారు. సబ్ రిజిస్ట్రార్ గా ప్రభుత్వ ఉద్యోగం వస్తే అక్కడి పరిస్థితులతో రాజీపడలేక తనకు తానుగానే ఉద్యోగం వదులుకుని సినిమాల్లోకి వెళ్లారు ఎన్టీఆర్. 1949 నవంబర్ 24 – దర్శక నిర్మాత ఎల్.వి.ప్రసాద్ సినిమా ‘మనదేశం’ విడుదలైంది. ఈ సినిమాలో పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ పాత్రతో నటునిగా ఎన్టీఆర్ సినీరంగ ప్రస్థానం మొదలైంది. 44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు కలిపి మొత్తం 298 సినిమాలు చేసారు ఎన్టీఆర్. వీటిల్లో 16 తమిళ సినిమాలు, 3 హిందీ సినిమాలు ఉన్నాయి
Ntr
సినిమాల్లో నటిస్తూనే రాజకీయ రంగం వైపు ఎన్టీఆర్ మళ్లారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఒక ప్రభంజనం. ఆత్మగౌరవ నినాదం ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ” అంటూ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగు వారికి స్వర్ణయుగపు వైభవాన్ని ఇచ్చింది. 1982 మార్చి 29న హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ‘తెలుగుదేశం’ పార్టీని ఎన్టీఆర్ ప్రకటించారు. 1983 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. దేశంలోనే తొలి సారిగా రూ 2 కిలో బియ్యం పధకం ప్రారంభించారు. 1984లో ఎన్టీఆర్ కు అమెరికాలో బైపాస్ సర్జరీ జరిగింది. అదే సమయంలో నాదెండ్ల భాస్కరరావును నాటి గవర్నర్ ముఖ్యమంత్రిని చేసారు. తిరిగొచ్చిన ఎన్టీఆర్ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరటి చేసిన ప్రజాయాత్ర విజయం సాధించింది.
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం దేశ రాజకీయాలలో సమూల మార్పులు తెచ్చింది. బడుగులకు అధికారాన్ని ఇచ్చింది. స్త్రీలకు సాధికారతను ఇచ్చింది. దేశంలో జన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. తిరుగులేదనే అధికార దర్పంతో కొనసాగుతున్న కాంగ్రెస్ నాయకత్వానికి తెలుగు వాడి పౌరుషం ఏంటో చాటి చెప్పింది. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన చదువుకున్న యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. బీసీ కులాల వారిని ప్రోత్సహించి టికెట్లు ఇచ్చారు. పార్టీలో క్రమశిక్షణకు ఎన్టీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు.ప్రతి రెండేళ్లకోసారి పార్టీ సభ్యత్వ నమోదు తప్పనిసరి. ఎవరైనా పార్టీ గీత దాటితే ఊరుకొనేవారు కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులు, అవిశ్వాస తీర్మానాల బెడద తగ్గించడానికి.. సర్పంచ్, ఎంపీపీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్, మునిసిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్‌ను ప్రజలు నేరుగా ఎన్నుకునేలా చేశారు. దీనివల్ల ఈ సంస్థలకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది.
కేంద్రంలోని కాంగ్రెస్ పైన రాజకీయంగా తిరుగుబాటు చేసిన ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో పార్టీలను కలుపుకోవటంలో సక్సెస్ అయ్యారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసారు. 1985లో శాసనమండలి రద్దు చేసారు. దేశంలో తొలి సారిగా తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు కల్పిస్తూ చట్టం చేసారు. జాతీయ పార్టీలు నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఎన్టీఆర్ ను ఎన్నుకొన్నారు. 1989 లో ఏపీలో టీడీపీ ఓడిపోయింది. ప్రతిపక్ష నేతగా ఎన్టీఆర్ ప్రభుత్వం పైన సమరం నడిపారు. 1993 లో ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ విడుదల అయింది. 1994 ఎన్నికల్లో తిరిగి ఎన్టీఆర్ సీఎం అయ్యారు. 1995 లో టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో చంద్రబాబు సీఎం అయ్యారు. 1996 జనవరి 18న ఎన్టీఆర్ అస్తమించారు.
రేపు 28వ తేదీ ఎన్టీఆర్ శతజయంతి. తెలుగు నేలకు..జాతికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. గత ఏడాది కాలంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. 100వ జన్మదినం సందర్భంగా అభిమానులు..టీడీపీ ప్రత్యేక కార్యక్రమాలతో నివాళి అర్పిస్తోంది.